Monday, December 23, 2024

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

Development of SCs and ST

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు ,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి అక్కడక్కడ ఎస్ సి, ఎస్ టి ల పై అంటరానితనం, అసాంఘికంగా ప్రవర్తించడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. సమాజంలోని అసమానతలు రూపు మాపేందుకు అధికారులు ముందుకు రానట్లయితే అవి ఇతర రూపం దాల్చే అవకాశం ఉందని, అందువల్ల సంబంధిత శాఖల అధికారులు ఇలాంటి వాటిపై వెంటనే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
గురువారం వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫెరెన్సు ద్వారా నిర్వహించిన మహబూబ్ నగర్ జిల్లా ఎస్సి, ఎస్టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి మంత్రి హైదరాబాద్ నుండి పాల్గొన్నారు.
ఎఎస్సి, ఎస్టిలపై దాడులకు సంబంధించి పోలీసులు వెంటనే కేసులు నమోదు చేయాలని, ముఖ్యంగా భూమి తగాదాలు, ఇతర విషయాలకు సంబంధించి నమోదైన కేసుల పై తక్షణ నివేదికలు ఇవ్వాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో గత సమావేశాలలో చర్చించిన విషయాలన్నింటిని మరొకసారి సమీక్షించి, సమీక్ష తర్వాత వాటికి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలోని ప్రజాప్రతినిధులందరు ఎస్సి, ఎస్టిల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఎస్సి, ఎస్టిలపై కేసులు మాత్రమే కాకుండా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలని, వ్యక్తిగత రుణాలు, ఆయా పథకాల కింద లబ్ది పొందడంలో సమస్యలను పరిష్కరించాలన్నారు. కేవలం ఫిర్యాదులు వచ్చినప్పుడే కాకుండా ఎస్సి, ఎస్టిలకు సంబంధించిన సమస్యలను సుమోటోగా తీసుకుని సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దలితబంధు పథకం ద్వారా ఎస్సి లబ్ధిదారులు లాభం పడేలా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో చర్చించాలన్నారు.

సమావేశం ప్రారంభమైన వెంటనే జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు మాట్లాడారు. ఎస్సి, ఎస్టిలపై దాడులకు సంబంధించిన కేసులతో పాటు, ఎస్ సి ఎస్ టి లకు అమలు చేస్తున్న పథకాలను ఎస్ సి ఎస్ టి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో సమీక్షించడం జరుగుతుందని, ఇటీవల రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో జిల్లాలోని ఎంపీలు, శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతో దళిత బంధు పథకంపై చర్చించడం జరిగిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ లో మరోసారి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను, ఇతర వివరాలను జిల్లా కలెక్టర్ సభ్యులకు కూలంకషంగా వివరించారు.
అనంతరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పై కలెక్టర్ మాట్లాడారు కేసుల పరిష్కారంలో జాప్యం చేయకూడదని, అదేవిధంగా సభ్యులు సమావేశం దృష్టికి తీసుకు వచ్చిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు చేపట్టాలని, ఎస్ సి ,ఎస్ టి ధ్రువపత్రాల జారీలో జాగ్రత్తలు తీసుకోవాలని, భూముల తగాదాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు కోరిన పక్షంలో రెవెన్యూ అధికారులు ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీల కు సంబంధించిన లబ్ది, నష్ట పరిహారం వంటివి కలెక్టర్ కార్యాలయం నుంచి వారం రోజుల్లో పరిష్కరించి పంపాలని ఆయన ఆదేశించారు. ఒంటరి ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉపాధి కల్పించేందుకు గాను స్కిల్ డెవలప్మెంట్ కింద వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా ఎస్ పి .ఆర్ వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఎస్సి, ఎస్టిల కేసులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ సంవత్సరం జులై వరకు 45 కేసులు నమోదు కాగా, 31 కేసులకు ఛార్జ్ షీట్ దాఖలు చేశామని, 14 కేసులు ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్నాయని తెలిపారు. హైకోర్టు లో పెండింగ్ ఉన్న 2 కేసులు తప్ప తక్కిన కేసులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు.

ఎస్సి, ఎస్టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బాలయ్య మాట్లాడారు. మూసాపేట లో ఎస్. టి దేవాలయానికి భూమిని కేటాయించాలని కోరగా, ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ తహసీల్దార్ ను ఆదేశించారు. మహబూబ్ నగర్ లోని ఇంటిగ్రేటెడ్ ఎస్. సి హాస్టల్ లో ఉన్న ఖాళీ స్థలంలో ఎస్. సి స్టడీ సర్కిల్ నిర్మాణం చేపట్టాలని సభ్యుడు కృష్ణ కోరారు.

మరో సభ్యుడు బాలరాజు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలు కానివారు ఎస్సీ సర్టిఫికెట్లు పొంది ఇటీవల ఉద్యోగుల కేటాయింపులో మహబూబ్ నగర్ కు బదిలీ పై వచ్చారని, ఇలాంటి వాటి పై దృష్టి కేంద్రీకరించాలని విన్నవించారు.
మరో సభ్యురాలు ఇందిరా ప్రియదర్శిని స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గోవర్ధని మాట్లాడుతూ ఎస్సీ ,ఎస్టీల లో ఒంటరి మహిళలకు ఆర్థిక సహకారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వీటన్నిటి పై కలెక్టర్ స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశానికి దేవరకద్ర శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ యాదయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News