Monday, December 23, 2024

తొమ్మిదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా నిలిపేందుకు సిఎం కెసిఆర్ చేస్తున్న కృషితో కేవలం తొమ్మిదేళ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు.

సోమవారం మనవార్డు…. మన ఎంఎల్‌ఎ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని 8, 9 వార్డుల్లో ఎంఎల్‌ఎ సంజయ్‌కుమార్ పర్యటించారు. ఎంఎల్‌ఎకు వార్డు ప్రజలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికి నొదుట తిలకం దిద్దారు. వార్డుల్లో ప్రజలతో కలిసి కలియతిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అప్పటికప్పుడు పరిష్కారమయ్యే సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించడంతో పాటు ఇతరత్రా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్షం వల్ల అభివృద్ధి కుంటు పడిపోయి ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. అస్తవ్యస్తంగా తయారైన జగిత్యాల పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందన్నారు.

కాలం చెల్లిన మాస్టర్‌ప్లాన్‌తో పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, అప్పుడెప్పుడో రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌తో అనుమతులు రాక చాలా వరకు మున్సిపల్ అనుమతి లేకుండానే గృహ నిర్మాణాలు చేపట్టారన్నారు. సరైన రోడ్లు, మురికి కాలువలు లేక జనం పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావన్నారు. ప్రజలు పడుతున్న బాధలను గుర్తించి పట్టణంలో జోన్‌ల మార్పిడి చేయించామని, దాంతో గృహ నిర్మాణాలు చేపట్టేందుకు మున్సిపల్ నుంచి అనుమతులు రావడంతో పాటు రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుకునే అవకాశం ఏర్పడిందన్నారు.

పట్టణ ప్రగతి ద్వారా వార్డుల్లోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిధులు వెచ్చించడం జరిగిందన్నారు. గత 66 యేళ్లలో జరగని అభివృద్ధిని కేవలం 9 యేళ్లలోనే తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్దే ధ్యేయంగా సిఎం కెసిఆర్ ముందుకు సాగుతున్నారన్నారు.

రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కార్యాచరణ రూపొందించుకుంటున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తుంటే దేశం అనుసరిస్తోందని, తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. జగిత్యాల పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆదర్శ పట్టణంగా నిలపడమే ధ్యేయంగా తాము ముందుకు సాగుతున్నామన్నారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వసతి సౌకర్యాలను కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డు ఆయా వార్డు కౌన్సిలర్లు బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News