సూర్యాపేట: ఆధ్యాత్మికతకు అద్దం పట్టేలా తెలంగాణలోని ఆలయాలు అభివృద్ధ్ది జరిగాయని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతోనే రాష్ట్రంలోని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడం జరిగిందని హుజూర్‌నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలల్లో భాగంగా బుధవారం హుజూర్‌నగర్ మండలంలోని గోపాలపురం శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఎమ్మెల్యే ముఖ్యఅతిధిగా పాల్గొని ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ అర్చకులు అలహరి నరసింహాచార్యులు, ముడుంబై అన్వేష్‌లు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికి, స్వామివారి శేషవస్త్రాలతో ఘనంగా సత్కరించారు. అలాగే ఎమ్మెల్యే కూడా ఆలయ ఈవో, చైర్మన్‌లను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలన్నారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన దేవా లయాలను కోట్లాదిరూపాయలను వెచ్చించి అత్యాద్భుతంగా అభివృద్ధి చేసుకోవడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలోని మేళ్ళచెర్వు శంభులింగేశ్వరస్వామి ఆలయం, సోమవరంలోని సోమప్ప ఆలయం, జాన్‌పహాడ్ దర్గాలు నిలుస్తాయని పేర్కొన్నారు. పురాతన దేవలయాలను అభివృద్ధి చేయడంతోపాటు నూతన దేవాలయాలను కూడా నిర్మించుకున్నామని చెప్పారు.
దేవాలయాలు, చర్చ్‌లు, మసీదుల అభివృద్ధికి కెసిఆర్ ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. అందువల్లే యావత్ భారతదేశంలోనే ఎక్కడలేనన్ని సంక్షేమపధకాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి వాటిని ప్రజలకు అందజేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చలపతిరావు, ఆలయ చైర్మన్ సాతులూరి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ చీకూరి రాజారావు, ఆలయ కమిటీ సభ్యులు, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.