Saturday, November 23, 2024

పాలన సంస్కరణలతో అభివృద్ధి బాట

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ బ్యూరో : ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలన సౌలభ్యం కోసం ప్రజలకు మంచి సేవలందించాలనే లక్షంతో అనేక సంస్కరణలను తీసుకువచ్చి సుపరిపాలనను అందించడం జరుగుతోందని అర్బన్ ఎంఎల్‌ఏ బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవతరణ అనంతరం సిఎం కెసిఆర్ ప్రజా పాలన సౌలభ్యం కోసం ప్రజలకు మెరుగైన సేవలందించాలనే ఆశయంతో అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నారు.

అందులో భాగంగానే మొదటిసారిగా 10 జిల్లాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించి అధికారులకు పనిభారం తగ్గించడమేగాకుండా జిల్లా కేంద్రాలకు సులభంగా చేరుకునేలా చేశారని అన్నారు. జిల్లా కేంద్రంలో సమీకృత కార్యాలయాలు నిర్మించడం జరిగిందని, దీంతో అన్ని శాఖల అధికారులు ఒకే దగ్గర నుండి పనిచేసేలా సమర్థవంతంగా పర్యవేక్షణ సాగేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. తద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు పర్యవేక్షణ మరింత సులభతరమవుతుందన్నారు. తెలంగాణ కీర్తి శిఖరం డా. అంబేద్కర్ నూతన సచివాలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. నూతన పోలీసు కమిషనరేట్ల ఏర్పాటువల్ల నేరాలు నియంత్రణ, నేర పరిశోధన సులువవుతుందన్నారు.

గ్రామ పంచాయతీల పరిపాలన పట్టణాల పరిపాలన తీరును పర్యవేక్షణ కోసం ప్రభుత్వం జిల్లాకు ఒక అదనపు కలెక్టర్‌ను నియమించిందన్నారు. ప్రజల సంక్షేమం కోసం స్వరాష్ట్రం అభివృద్ధి కోసం, సంస్కరణలు చేసి పేదరికాన్ని నిర్మూలించడం కోసం సిఎం కెసిఆర్ అనేక సంస్కరణలు చేశారని అన్నారు. నూతన రాష్ట్రంలో కెసిఆర్ 9 ఏండ్లలో ప్రగతి సాధించి దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని, ఇందులో భాగస్వాములైన అధికారులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. పరిపాలన ప్రజల సౌకర్యార్థం నిజామాబాద్‌లో నూతనంగా ఉత్తర , దక్షిణ మండల తహసీల్దార్ కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే పోలీసు సిబ్బందిపై భారం తగ్గించేందుకుగాను నిజామాబాద్‌లో ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, ఆయాశాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News