Thursday, January 23, 2025

రాష్ట్రంలో ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు

- Advertisement -
- Advertisement -

భువనగిరి : రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి అందే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా భువనగిరి నియోజకవర్గం సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ దినోత్సవ కార్యక్రమం భువనగిరి పట్టణంలోని ఎకె ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్ కేంద్రాల వైద్య అధికారులకు, ఆరోగ్య కార్యకర్తలకు, జిల్లా ఫుడ్ సేఫ్ట్ ఆఫీసర్ స్వాతి, డ్రగ్ ఇన్స్పెక్టర్ అశ్వినికుమార్లకు ప్రశంసా పత్రాలు, మెమొంటోల పురస్కారం జరిగింది. గర్బిణీ స్త్రీలకు కెసిఆర్ న్యూట్రిషియన్ కిట్స్, అలాగే హెల్త్ అసిస్టెంట్లకు బిపి యంత్రాలు, ఆశా కార్యకర్తలకు యూనిఫామ్ బట్టలు అందచేశారు.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ, ఈనెల 2 నుండి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 21 రోజులు జరుపుకుంటున్నామని, ప్రతిరోజూ వివిధ శాఖల ద్వారా నిర్వహించబడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రజలకు వివరిస్తున్నామని, తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తరువాత ఏర్పడిన మార్పులను తెలుపుతున్నామని, ఈ రోజు ఆరోగ్య పండుగ జరుపుకుంటున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టి దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య రంగంలో విశేష అభివృద్ధిని సాధిస్తున్నారని, జిల్లా కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేసుకున్నామని, త్వరలో టి హబ్ ఏర్పాటు చేసుకుంటామని,చౌటుప్పల్, ఆలేరులో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు, జిల్లాలో 80 ఆరోగ్య సబ్ సెంటర్ల భవనాలను 20 లక్షలతో అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి గర్బిణీ స్త్రీలకు పోషకాహారం అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ డెలివరీలు పెరగాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, అమ్మఒడి, కెసిఆర్ కిట్స్ అందిస్తున్నారని, రాష్ట్రంలో కంటి చూపు సమస్యతో ఎవరూ బాధపడకూడదని కంటి వెలుగు పథకం రెండు విడుతలుగా నిర్వహించి కంటి పరీక్షలు, అద్దాలు అందించారని, ప్రతి మంగళవారం బీబీనగర్, గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేకంగా మహిళల వైద్యం కోసం ఆరోగ్య మహిళా కేంద్రాలలో సేవలు అందించడం జరుగుతున్నదని, త్వరలోనే జిల్లాలోని మిగిలిన ఆరోగ్య కేంద్రాలలో ప్రారంభించడం జరుగుతుందని,వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా పెన్షన్స్ అందించడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, జిల్లాలో ఉత్తమ వైద్యసేవలు అందించినందుకు గాను 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు గాను 12 ఆరోగ్య కేంద్రాలకు ప్రశంసా పత్రాలు అందుకున్నామని,గత రెండు సంవత్సరాలలో 5 అవార్డులు వచ్చాయని తెలిపారు.

జిల్లాలో వైద్య సేవల కోసం 99 యం ఐ హెచ్ ఎఫ్ సిబ్బంది, 27 మంది మెడికల్ ఆఫీసర్స్, 33 మంది సిబ్బంది, 35 మంది ఆయుష్ సిబ్బందిని నియమించడం జరిగిందని, 80 ప్రైమరీ హెల్త్ సబ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో టి డయాగ్నస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు, వీటిలో 134 పరీక్షలు, రోజు వారిగా 400 శాంపిల్స్ చేయడం జరుగుతుందని, పరీక్షలకు బయటకు వెళ్లే అవసరం లేదని, అన్ని పరీక్షలు డయాగ్నస్టిక్ సెంటర్లోనే చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం, ప్రజల సహకారంతో ప్రతి శుక్రవారం రోజున, శుక్రవారం సభ నిర్వహించడం జరుగుతున్నదని, సమీకృత వైద్య శాఖల వైద్య సిబ్బంది, ఆయుష్ సిబ్బంది, మెడికల్ ఆఫీసర్స్, ఆశా, ఎఎన్‌ఎం సిబ్బంది సహాయంతో గర్భిణీ స్త్రీలు, బాలింతల కోసం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మహిళ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతున్నాయని తెలిపారు.

జిల్లాలో గత 9 సంవత్సరాలలో 35 శాతం నుండి 65 శాతం ప్రసవాల సంఖ్య పెరిగిందని, జిల్లాలో సాధారణ ప్రసవాలు పెరిగాయని, మహిళల్లో రక్తహీనత 70 శాతం నుండి 30 శాతం తగ్గిందని, ప్రహవాలకు సంబంధించి గతంలో ప్రతి వెయ్యి మందిలో 97 మంది తల్లులు చనిపోయేవారని, అది ఈరోజు 39 తగ్గిందని, అలాగే శిశు మరణాలు 39 నుండి 14 తగ్గాయని, శుక్రవారం సభలలో అంగన్వాడీ, పెహెచ్సి, సిహెచ్సి సిబ్బంది కృషి గొప్పదని అన్నారు. ఆరోగ్య మహిళ, ఆరోగ్య లక్ష్మి, కెసిఆర్ కిట్స్ తదితర పథకాల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం బీబీనగర్, గుండాల పిహెచ్సిలలో ప్రారంభించడం జరిగిందని, ఇప్పటి వరకు 2200 మహిళలు సేవలు పొందడం జరిగిందని తెలుపుతూ డయాగ్నస్టిక్ హబ్ ్రప్రారంభం అయ్యాక ఇంకా వైద్య సేవలు పెరుగుతాయని అన్నారు. జిల్లాలో డయాలసిస్, ఫిజియోథెరపీ, మెంటల్ హెల్త్ సైక్రియాటిస్ట్ సేవలు అందుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా అన్ని విధాలుగా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఆశాలు, ఎఎన్‌ఎం అనేక వైద్య సలహాలు, సేవలు అందిస్తున్నారని, ఆశా సిబ్బంది వేతనాలు పెంచడం జరిగిందని అన్నారు.

కోవిడ్ రెండవ విడుతలో ప్రజల సహకారంతో జిల్లాలో వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేసుకున్నామని, వైద్య సిబ్బంది మంచి కౌన్సిలర్లుగా సేవలందిస్తున్నారని, వైద్యులు మానవత్వంతో ఉంటారని, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రజలకు ఇంకా మంచి వైద్య సేవలు అందించాలని కోరారు.జిల్లా కలెక్టరుగా పమేలా సత్పథి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపిపి నరాల నిర్మల, జడ్పిటిసి బీరు మల్లయ్య, వీరవెల్లి ఎంపిటిసిలలిత, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సి.హెచ్.కృష్ణారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ మల్లిఖార్జునరావు, జిల్లా అధికారులు, హెచ్సి, సిహెచ్సి కేంద్రాల వైద్య సిబ్బంది,ఆయుష్ డాక్టర్లు, ప్యారా మెడికల్, ఆశా, ఎఎన్‌ఎం సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News