Wednesday, January 22, 2025

రూ 137.76 కోట్లతో తెలంగాణలో అభివృద్ధి పనులు

- Advertisement -
- Advertisement -

వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
బల్కంపేట్ నుండి ఆ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి, జూపల్లి

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ 2.0 , ప్రసాద్ పథకంలో భాగంగా రూ. 137.76 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలను శ్రీనగర్ నుంచి వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. హైదరాబాద్ బల్కంపేటలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ…. మన దేశంలో పర్యాటక రంగాన్ని ఎంతగానో అభివృద్ది చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని కోరారు.

దుబాయ్, యూరప్ , సింగపూర్ దేశాలతో పోలిస్తే భారతదేశ పర్యాటక రంగం అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారని, కానీ పర్యాటక అభివృద్ధికి వేల కోట్ల రూపాయాలు కేటాయించాల్సిన అవసరం ఉందని అన్నారు. టూరిస్టుల రాక, పర్యాటక రంగ అభివృద్ధి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తుందని, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అభివృద్ధి పనుల వివరాలను మంత్రి జూపల్లి వివరిస్తూ…. ప్రసాద్ పథకం కింద రూ.4.05 కోట్ల వ్యయంతో హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అన్నదాన భవనం, తాగునీటి సదుపాయం, కెఫ్‌టేరియా, టికెట్ కౌంటర్, తదితర అభివృద్ధి పనుల శిలాపలకాన్ని వర్చువల్ గా ప్రధాని మోడీ ప్రారంభించారన్నారు. ప్రసాద్ పథకంలో రూ.38.90 కోట్ల వ్యయంతో గద్వాల జిల్లా అలంపూర్ లోని జోగులాంబదేవి ఆలయంలో అభివృద్దిలో భాగంగా నిర్మించిన ప్రసాద్ స్కీం భవనం, సాంస్కృతిక భవనం, అన్నదాన సత్రం, తదితర వాటికి మోదీ ప్రారంభోత్సవం చేశారని తెలిపారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి కోటను స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.56.81 కోట్ల వ్యయం ( ప్యాకేజీ 1) తో అభివృద్ధి చేయనున్నారని మంత్రి జూపల్లి తెలిపారు.

ఇంకా భువనగిరి కోట ప్రాంతంలో విశ్రాంతి భవనాలు, పార్కులు, హరిత వనాల అభివృద్ధికి, కోటపైకి చేరుకునేందుకు రోప్ వే నిర్మాణానికి వర్చువల్ గా శంకుస్థాపన చేశారని తెలిపారు. స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.38 కొట్ల వ్యయం ( ప్యాకేజీ -1) తో వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ ప్రాంతాన్ని ఎకో టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారని తెలిపారు. కాగా అంతకుముందు బల్కంపేట ఎల్మమ్మ అమ్మవాకిరి మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు మంత్రి జూపల్లికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

Temple

Minister

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News