Monday, December 23, 2024

కాంగ్రెస్‌లో చేరనున్న టిటిడిపి సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ !?

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు

మనతెలంగాణ/హైదరాబాద్:  టిటిడిపి సీనియర్ నాయకులు దేవేందర్ గౌడ్ త్వరలో కాంగ్రెస్‌లో పార్టీలో చేరనున్నారు. శుక్రవారం దేవేందర్ గౌడ్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కీ గౌడ్‌తో భేటీ అయ్యారు. ఈనెల 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాత్రికి రాత్రే నేతల కండువాలు మారుతున్నాయి. మరోవైపు గెలుపే లక్ష్యంగా నేతలు, ఇతర పార్టీ నాయకుల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే సీనియర్ లీడర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తాజాగా మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్‌తో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ సమావేశం కావడంతో కాంగ్రెస్‌లో దేవేందర్ గౌడ్ చేరిక ఇక లాంఛనమే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

గతంలోనూ రేవంత్‌తో దేవేందర్ గౌడ్ భేటీ
అసెంబ్లీ ఎన్నికల వేళ చాలామంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు పార్టీలను మారారు. తాజాగా బిజెపికి విజయశాంతి గుడ్‌బై చెప్పగా, మాజీ ఎంపిలు వివేక్, రాజగోపాల్ రెడ్డి లాంటి చాలా మంది నేతలు పార్టీ కండువాలు మార్చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్, దేవేందర్ గౌడ్‌తో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలోనూ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సైతం దేవేందర్ గౌడ్‌తో సమావేశమై చర్చలు జరిపారు. ఈ ఏడాది జూలై 18వ తేదీన దేవేందర్ గౌడ్‌తో పాటు ఆయన తనయులు వీరేందర్ గౌడ్, విజయేందర్ గౌడ్‌లను రేవంత్ కలుసుకున్నారు. ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతన్న వీరేందర్ గౌడ్‌తో సహా కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్లు సమాచారం. ఆ సమయంలో రేవంత్ వెంట మధుయాష్కీ గౌడ్, మహేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు.

2008లో టిడిపికి రాజీనామా చేసిన దేవేందర్ గౌడ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తూళ్ల దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహారించారు. చంద్రబాబు హయాంలో రెవెన్యూ, హోం మంత్రిగా పనిచేశారు. అయితే, తెలంగాణకు టిడిపి అనుకూలంగా లేదంటూ 2008లో దేవేందర్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేసి, నవ తెలంగాణ పార్టీని స్థాపించారు. అనంతరం 2009 ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేశారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీచేసి ఓటమి చవిచూశారు. మరోసారి తెలంగాణ టిడిపిలో చేరి, కొంతకాలం పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఇదిలావుంటే అనారోగ్య కారణాలతో దేవేందర్ గౌడ్ చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అమెరికాలో శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన తెలుగు దేశం పార్టీ వీడి భారతీయ జనతా పార్టీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అయితే ఆయన తనయుడు వీరేందర్ గౌడ్ ఒక్కరే కషాయ కండువా కప్పుకున్నారు. దేవేందర్ గౌడ్ మాత్రం టిడిపిలోనే కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే, దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ రెండేళ్ల క్రితం బిజెపిలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నుంచి టిడిపి తరుపున పోటీ చేసి ఓడిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News