Wednesday, January 22, 2025

ఫడ్నవీస్, అజిత్ పవార్‌లకు త్రుటిలో తప్పిన ముప్పు

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్ బుధవారం త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నాగపూర్ నుంచి గడ్చిరోలికి వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం మధ్య దారి తప్పింది. అయితే, పైలట్ నిపుణతతో హెలికాప్టర్‌ను సరిగ్గా దారిలోకి తెచ్చి గడ్చిరోలిలో భద్రంగా దించారు. గడ్చిరోలి జిల్లా అహెరి తహసీల్‌లో రూ. 10 వేల కోట్ల సుర్జాగడ్ ఇస్పాత్ సమీకృత ఉక్కు ప్రాజెక్టుకు శంకుస్థాపన నిమిత్తం వారు ముగ్గురూ గడ్చిరోలి వెళ్లారు. అజిత్ పవార్ ఈ ఉదంతాన్ని సభలో వివరించారు. తాము భద్రంగా దిగడానికి పైలట్ నైపుణ్యమే కారణమని ఆయన శ్లాఘించారు. ‘హెలికాప్టర్ మామూలుగా నాగపూర్ నుంచి గడ్చిరోలికి బయలుదేరింది. మా టేకాఫ్ తరువాత నేను మేఘాలు చూస్తూ సుఖంగా కూర్చున్నాను.

వాటిని చూడవలసిందని ఫడ్నవీస్‌కు సూచించాను. అయితే, ప్రయాణంలో మబ్బుల వల్ల హెలికాప్టర్ దారి తప్పింది. అయినప్పటికీ ఫడ్నవీస్ నిబ్బరంగా ఉండి, నాతో మాట్లాడుతూనే ఉన్నారు. నేను ఏమీ తోచని స్థితిలో పడ్డాను. కలవరపడుతున్నాను. అయితే, ఆందోళన చెందవద్దని, తనకు ఇంతకు ముందు ఆరు ప్రమాదాలు జరిగాయని, సురక్షితంగా బయటపడ్డానని ఫడ్నవీస్ నాతో చెప్పారు. ఇప్పుడు నేను కూడా సురక్షితంగానే ఉంటానని నాతోఆయన చెప్పారు. కలవరపడవద్దని నాతో ఫడ్నవీస్ పదే పదే చెప్పినట్లు అజిత్ పవార్ తెలిపారు. ‘భద్రంగా కిందకు దిగుతామా అనే ఆందోళనలో ఉన్నాను. కాని ఫడ్నవీస్‌లో ఏమాత్రం కంగారు లేదు. ల్యాండింగ్ ప్రదేశం కోసం చూస్తూ ఉండవలసిందని నాతో ఉదయ్ సామంత్ చెప్పారు. కిటికీలో నుంచి దానిని చూసిన తరువాత నాకు ఊరట కలిగింది’ అని అజిత్ పవార్ తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News