ఎంఎన్‌ఎస్‌కు మంత్రి పదవి ఆఫర్?
ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రేను ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలిశారు. దాదర్‌లోని థాక్రే నివాసం ‘శివతీర్థ’కు స్వయంగా వెళ్లిన ఫడ్నవీస్ గంటన్నరకు పైనే మంతనాలు జరిపారు. రాజకీయపరమైన చర్చ ఇద్దరి మధ్య జరిగినట్లు తెలుస్తోంది. ఎంఎన్‌ఎస్‌కు ఉన్న ఒకే ఒక శాసనసభ్యుడు ప్రమోద్ రతన్ పాటిల్. కల్యాణ్ రూరల్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2010లో ఎంఎన్‌ఎస్ పార్టీ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో 29 సీట్లు గెలవడానికి ఈయనే మూలకారణం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ఆయనకు పట్టుంది. అందుకే ప్రమోద్‌కు కేబినెట్ బెర్త్ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. మరో ప్రతిపాదన సైతం రాజ్ థాక్రే ముందు ఉంచినట్లు తెలుస్తోంది. రాజ్ థాక్రే తనయుడు అమిత్ థాక్రేకు షిండే కేబినెట్‌లో ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అమిత్ చట్టసభలో సభ్యుడిగా లేడు. ఒకవేళ కేబినెట్ హోదా గనుక ఇసే ఎమ్మెల్యేగా లేదంటే ఎమ్మెల్సీగా తప్పకుండా గెలవాల్సి ఉంటుంది.