అశ్వరథంపై అమ్మవారు ఊరేగింపు, అలరించిన కూచిపూడి నృత్యం
మన తెలంగాణ/ బాసర : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు శ్రీ శారదీయ శరన్నవరాత్రులు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా 8వ రోజు సరస్వతి అమ్మవారు మహాగౌరీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. అమ్మవారికి గౌరీ నామార్చన అనంతరం చక్కెర పొంగళిని నైవేద్యంగా ఆలయ వైదిక బృందం నివేదించారు. అధిక సంఖ్యలో భక్తులు జ్ఞాన సరస్వతి చెంత అనుష్టానంతో జ్ఞాన సముపార్జనగావిస్తూ భక్తులు పరమానందభరితులవుతున్నారు. మరికొంత మంది భక్తులు మధుకరి దీక్షలు చేపట్టి ధ్యాన మందిరంలో అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారికి ప్రీతికి పాత్రులవుతున్నారు. పలు ప్రాంతాల నుండి క్షేత్రానికి విచ్చేసిన భక్తులు ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి క్షేత్రంలో ఆలయ అర్చకుల సమక్షంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలను చేయిస్తూ కుంకుమ పూజలో పాల్గొంటున్నారు.
నాందెడ్ జిల్లా గడిపుర జగదీష్ మహారాజ్, వారి శిష్యబృందం ఆధ్వర్యంలో నవరాత్రుల సందర్బంగా భక్తులకు ఉచితంగా అందిస్తున్న అన్నదాన ప్రసాదంను అమ్మవారి భక్తులు స్వీకరిస్తున్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం తరపున ఆలయ కోటి గాజుల మండపంలో ప్రతినిత్యం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో విజయ మధవి శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్యం చేసిన విధి సాయితేజ శ్రేయమ్సి చక్రిక నివృతి శ్రీ వైష్ణవి శ్రీ విజయ మహదేవి సేవ సాంస్కృతిక సేవ అకాడమి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన నృత్యం పలువురికి ఆకట్టుకున్నాయి. కళాకారులు అమ్మవారి కీర్తిని ఇనుమడింపచేసే పలు ప్రదర్శనలు భావిస్తుండగా అధిక సంఖ్యలో భక్తులు హాజరై కళాప్రదర్శనలను తిలకిస్తున్నారు. ఈ రోజు మహా గౌరీ అవతారంలో అమ్మవారు తెల్లటి నందిపై కొలువుదీరి నాలుగు చేతులతో త్రిశూలం, డమరుకం (తాంబూరి) వర అభయ ముద్రలతో భక్తులను గౌరీ అమ్మవారు దీవిస్తుంది.
చెడు చేసే వారిని శిక్షిస్తూ సాధు సత్పురుషులను రక్షిస్తూ తల్లి గౌరీ మోక్షాన్ని ఇవ్వడం ద్వారా పునర్జన్మ భయాన్ని తొలగిస్తుందని భక్తుల విశ్వాసం. జీవితంలోని సకల కష్టాలను తొలగించే కల్పవల్లిగా భక్తులు అమ్మవారిని స్తుతిస్తూ ఉపాసిస్తూ సకల కోరికలను తీర్చే తల్లిగా అమ్మవారిని కొలుస్తారని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ వేద పండితులు శ్రీ నవీన్ శర్మ వెల్లడించారు. నేటితో అనగా శుక్రవారంతో దేవి నవరాతిర ఉత్సవాలు ముగియనున్నాయి. అనంతరం సాయంత్రం సరస్వతి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా అశ్వరథంపై భజా భజంత్రిల మధ్య ఊరేగించి అనంతరం జంబి వేడుకులు జరిపి అందరూ దసరా శుభాకాంక్షలు చెప్పుకుంటారు.