ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. కొందరు దీనిని మంచికి ఉపయోగిస్తుంటే.. మరికొందరు ఇష్టానుసారంగా వాడేస్తున్నారు. అయితే ఇటీవల స్మార్ట్ ఫోన్స్ కారణంగా.. పల్లెల్లో ఉన్న అద్భుతమైన టాలెంట్‌లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇక తమలో ఉన్న టాలెంట్‌ను ఇంటర్నెట్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసుకున్నవారు చాలా మందే.. ఇక సింగర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల మంత్రి కేటీఆర్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌ల మధ్య ఓ గాయని గురించి ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. రాష్ట్రంలోని మెదక్ జిల్లా నరైంగికి చెందిన 15 సంవత్సరాల గాయని శర్వాని వీడియోని చూసి దానిని దేవీశ్రీ, తమన్ వంటి వారికి ట్యాగ్ చేస్తూ… ఇలాంటి ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించండి అంటూ ట్వీట్ చేశారు.
దీంతో దేవిశ్రీ ప్రసాద్ స్పందిస్తూ.. తాను చేస్తున్న రాక్ స్టార్ ప్రోగ్రాంలో ఖచ్చితంగా పాటలు పాడిస్తానని.. ప్రతిభ ఉన్నవారికి ఎప్పుడూ తోడుగా ఉంటామని దేవి శ్రీ మాటిట్చారు. అయితే మాటల్లోనే కాదు చేతల్లోనూ తాను ముందుంటాను అని దేవీ శ్రీ ప్రసాద్ నిరూపించుకున్నారు. తాజాగా గాయని శర్వానిని వెతికి పట్టుకొని మరీ తన షోలో పాట పాడించారు దేవి శ్రీ. ఈ విషయాన్ని కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ.. మాట నిలబెట్టుకున్నాను అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు.. గాయని శర్వాని ఎంతో అద్భుతంగా పాడుతుందని ప్రశంసలు కురిపించారు. దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చూసిన కేటీఆర్ స్పందిస్తూ.. గొప్ప పని చేశావు బ్రదర్ అంటూ పొగిడేశారు.