ముంబై ఉగ్రదాడి సంఘటనలో కీలక సూత్రధారి తహవ్వుర్ రాణా భారత్‌కు చేరుకున్నాడు. రాణాను భారత్‌కు తీసుకురావడంపై ముంబై దాడుల్లో బాధితురాలు, ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను గుర్తించడంలో కీలక సాక్షిగా ఉన్న దేవికా రోటావన్ హర్షం వ్యక్తం చేశారు. అతడిని అమెరికా నుంచి తీసుకురావడం భారత ప్రభుత్వం సాధించిన పెద్ద విజయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడారు. “ తహవ్వుర్ రాణాను తీసుకొచ్చినందుకు భారత్, అమెరికా ప్రభుత్వాలకు ధన్యవాదాలు. రాణా నుంచి అనేక కీలక వివరాలు రాబట్టొచ్చు. పాకిస్థాన్‌లో ఇప్పటికీ దాగి ఉన్న ఉగ్రవాదులను పెంచి పోషించేవారి పేర్లు బయటకు రావొచ్చు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మోడీ సర్కార్ కృషి చేస్తోంది. పాకిస్థాన్‌లో దాగి ఉన్న ఉగ్రవాదులతోపాటు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే … ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేవారిని శిక్షించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నా.
అజ్మల్ కసబ్ మాదిరిగా ఉగ్రవాదులకు మరణ దండన విధించాలి. పాకిస్థాన్‌లో ఉన్న దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్ ఇతర కీలక సూత్రధారులను భారత్‌కు తీసుకొచ్చి ఉరిశిక్ష విధించాలి. ఇప్పటికీ పొరుగు దేశంలో ఉన్న ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారిని , కసబ్ లాంటి కిరాతకుల్ని తయారు చేసే వారిని అంతం చేయాలి. అప్పుడే ముంబైదాడుల్లో బాధితులకు న్యాయం జరుగుతుంది” అన్నారు. ముంబై దాడి ఘటన రోజును గుర్తు చేసుకున్న ఆమె, కసబ్‌ను చూపెట్టినప్పుడు తనకెవరైనా తుపాకీ ఇస్తే కాల్చేద్దామనుకున్నానన్నారు. అప్పుడు తన వయస్సు పదేళ్లేనని చెప్పారు. 26/11దాడిగా ప్రసిద్ధమైన ముంబై ఉగ్రదాడి 2008 నవంబరు 26 న జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 10 మంది ఉగ్రవాదులు ముంబై లోని వివిధ ప్రాంతాల్లో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 166 మంది అమాయకులను పొట్టనపెట్టుకోవడం యావత్ ప్రపంచాన్ని తీవ్ర విషాదానికి గురి చేసింది.