భక్తులతో కిక్కిరిసిపోతున్న మేడారం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పెద్దఎత్తున భక్తజనం తరలివస్తున్నారు. ఈనెల 16 నుంచి మహాజాతర మొదలుకానున్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది. సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద భక్తులు కిక్కిరిసిపోతున్నారు. భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవం కన్నులపండువగా కొనసాగుతోంది. పెద్దఎత్తున తరలివస్తున్న భక్తజనంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. చాలామంది భక్తులు మొక్కుకున్నట్లుగా నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పిస్తున్నారు. కరోనా మూడో ముప్పు, ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల మేడారంలో దుకాణాలను మూసివేశారు. బెల్లం, మంచినీళ్లు, పసుపు, కుంకుమ వంటి అత్యవసరమైన వస్తువులు మాత్రమే విక్రయిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులంతా అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులంతా మాస్కు ధరించి భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.