మనతెలంగాణ/వాజేడు : గిరిజనులు అట్టహాసంగా ఏటా రెండు రోజులపాటు నిర్వహించుకునే బీరమయ్య(బీష్మశంకరుడు) జాతర ఆదివారం భక్త జనంతో అటవీ ప్రాంతం పులకించింది. తెలంగాణ, చత్తీస్‌ఘడ్ సరిహద్దున ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న టేకులగూడెం గ్రామంలోని లొటిపిటగండి వద్ద కొలువైన బీరమయ్య జాతరను ప్రతి సంవత్సరం అడవి బిడ్డలు జాతరను అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన ఈ జాతరకు గిరిజన సంప్రదాయం ప్రకారం పరిసర ప్రాంతల గ్రామాల నుండి వారి వారి కుల దేవతలతో డోలు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ బీరమయ్య గుట్టకు చేరుకుని లక్ష్మీ దేవరకు పవిత్ర గోదావరి నదిలో గంగ స్నానాలు ఆచరించిన అనంతరం రాత్రి నుండి కోయ నృత్యాలు, కోలాటములు, దేవర్ల సంబురాలు తెల్లావారుజామున 4 గంటల వరకు జరుపుకున్నారు.
ఆదివారం ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ జాతరకు చత్తీస్‌ఘడ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు హాజరుకావడంతో లొటిపిటగండి భక్త జనంతో కిక్కిరిసిపోయి అటవీ ప్రాంతమంతా పులకించిపోయింది. శ్రీరామ నవమి జరిగిన మొదటి వారంలోనే ఈ జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణలో జరిగే అతి పెద్ద జాతర మేడారం తర్వాత బీరమయ్య జాతరే మరో జాతర. ఇక్కడ జరిగే రెండు రోజుల పాటు జరిగిన ఈ జాతరకు గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గోని గిరిజన నృత్యాలు చేస్తూ భక్తులను అలరింపచేశారు. అత్యంత కోలాహలంగా జరిగిన ఈ జాతరకు భక్తులు ఎండలను సైతం లెక్కచేయకుండా అధిక సంఖ్యలో హాజరయ్యారు. వెల్ విజన్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ, మంచినీళ్ళను భక్తులకు అందజేశారు. బీరమయ్య ను దర్శించుకునేందుకు సుమారు 40 వేల మందికి పైగా భక్తులు తరలివచ్చినట్లు ఆలయ కమిటీ అంచానా వేస్తున్నారు.
బీరమయ్యను దర్శించుకున్న ఎంఎల్‌ఏ పొదెం వీరయ్య…
ములుగు జిల్లా వాజేడు మండలంలోని తెలంగాణ, చత్తీస్‌ఘడ్ సరిహద్దు ప్రాంతమైన టేకులగూడెం గ్రామం లొటిపిటగడి వద్ద వెలసి ఉన్న బీరమయ్య(బీష్మశంకరుడు) ను ఎంఎల్‌ఎ పొదెం వీరయ్య దర్శించుకున్నారు. బీరమయ్యను దర్శించుకునేందుకు వచ్చిన ఆయనను ఆలయ కమిటీ సభ్యులు డోలు వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం లొటిపిటగండి పై వెలసియున్న బీరమయ్యను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.