Monday, December 23, 2024

అంగరంగ వైభవంగా అధ్యయనోత్సవాలు ప్రారంభం…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / భద్రాచలం : వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భద్రాద్రి రామయ్య భక్తులకు మత్స్యావతారంలో దర్శనమిచ్చాడు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని తరించడానికి భద్రాచలంలోని మిథిలా స్టేడియానికి భక్తులు బారులు తీరారు. భక్తుల రామనామ స్మరణతో భద్రాద్రి మారుమ్రోగింది. వేదమంత్రాల నడుమ మత్యావతార దర్శనంలో స్వామి వారిని వీక్షించిన భక్తులు ఆనందంతో పులకించారు.

తొలుత ఉత్సవమూర్తులను అంతరంగికంగా ప్రత్యేక స్నపకం నిర్వహించారు. మత్యావతారంలో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి విశ్వక్సేనపూజ, పుణ్యాహావచనం నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనార్ధం నిత్యకల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ముందుగా మత్యావతారంలో స్వామివారిని అందంగా అలంకరించారు. భక్తుల రామనామ స్మరణల సంకీర్తనలతో మత్యావతార రూపుడైన స్వామి వారిని మిథిలా పురికి తీసుకు రాగా భక్తులు దర్శించి తరించారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. “శ్రీరామ నీనామం ఎంతో రుచిరా” అని కీర్తనలు పాడారు.

Devotees crowd at Bhadradri temple

తొలక్కంతో శ్రీకారం..

అధ్యయనోత్సవాల్లో భాగంగా చతుర్వేద పారాయణం, రామాయణ పారాయణం చేసే రుత్వికులకు దీక్షా వస్త్రాలను భద్రాద్రి దేవస్థానం ఈఓ శివాజీ, ఏఈఓ శ్రావణ్‌కుమార్‌లు అందజేశారు. తర్వాత ప్రత్యేక ఆరాధనలో వేదాలు, ఇతిహాసాలు, పురాణం, భద్రాద్రి క్షేత్ర మహత్యం, దివ్య ప్రబంధంలో అధ్యయనాన్ని ప్రారంభించారు. దీనినే సంప్రదాయబద్దంగా తొలక్కంగా పిలుస్తారు. ఈ సందర్భంగా గంటపాటు నాళాయర దివ్యప్రబంధంలోని పద్యాలను సేవాకాలం చేశారు. అనంతరం మత్యావతార రూపుడైన స్వామి వారిని నిత్యకల్యాణ మండపానికి తీసుకురాగా భక్తులు దర్శించారు.

అంతకుముందు శ్రీసీతారామచంద్రస్వామి విగ్రహాలతో పాటు 12 ఆళ్వార్ విగ్రహాలను నిత్యకల్యాణ మండపంలో వేదిక వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం కల్యాణ మండపం వద్ద భక్తులు బారులు తీరారు. స్వామిని వేదమంత్రాలు, భాజాభజంత్రీలు, కోలాటాలు వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ మిథిలా స్వాగత ద్వారం వద్దకు తీసుకురాగానే.. ఒక్కసారిగా జై శ్రీరామ్ అంటూ భక్తులు నినదించారు. వైకుంఠ ఏకాదశి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తొలిరోజు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో మొట్టమొదటి అవతారం మత్యావతారం. ఈ అవతారానికి సంబంధించి రెండు గాధలు పురాణాల్లో ఉన్నాయి. మొదటిది జ్ఞాననిధులైన వేదాలను బ్రహ్మదేవుడి నుండి తస్కరించి సముద్రంలో దాగివున్న సోమకాసురుని సంహరించడానికి శ్రీమహావిష్ణువు మత్యావతారం ధరించి వేదాలను ఉద్దంరించాడని పురాణాలు చెబుతున్నాయి. రెండవది జల ప్రళయం నుండి నావలో ఉన్న వైవస్వత మనువును, సప్తఋషులను, సృష్టికి అవసరమైన విత్తనాలను, ఔషదులను మత్యావతారంలో రక్షించాడు. ఈ అవతారాన్ని భక్తులు దర్శించడం వల్ల కేతుగ్రహ బాధలు తొలగిపోతాయని ప్రతీతి.

నేడు కూర్మావతారం..

వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శనివారం కూర్మావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకొని అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించిన సమయంలో ఏ ఆధారం లేక మందరగిరి మునిగిపోతుంది. దేవతలు రాక్షసుల ప్రార్ధనపై శ్రీహరి కూర్మావతారాన్ని ధరిస్తాడు. మునిగిపోయిన మంధర పర్వతాన్ని తన వీపున నిలుపుకొని పైకి ఎత్తి సహాయపడతాడు. ఈ అవతారాన్ని దర్శించడం వల్ల శనిగ్రహ సంబంధమైన దోషాలు తొలుగుతాయని ప్రతీతి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News