విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన బుధవారం కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలానక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుని తరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు 110 హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. ప్రతి భక్తుడికి ఆలయ సిబ్బంది ఒక లడ్డూ ఉచితంగా అందచేశారు.టికెట్ దర్శనాలను రద్దు చేసి వేకువజామున 3 గంటల నుంచే అందరికీ సర్వదర్శనం కల్పించారు.
మూలా నక్షత్రం విశిష్టత : మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన తర్వాత దుర్గామాతను శరన్నవరాత్రి ఉత్సావాలలో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతి రూపంలో అలంకరిస్తారు. సరస్వతీ దేవిని దర్శించుకోవడం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్రహం పొంది సర్వ విద్యలలో రాణిస్తారని భక్తుల నమ్మకం.
పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు : ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్‌తో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. రన్నవరాత్రుల ఉత్సవాలలో విశిష్టమైన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతి దేవి అలంకరణ లో ఉన్న కనక దుర్గ అమ్మవారికి ప్రభుత్వం తరఫున సంప్రదాయంగా పట్టు వస్త్రాలను సమర్పించేందుకుగాను వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాజగోపురం వద్ద ఆలయ స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ పరివేష్టం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి మంగళ వాయిద్యాలతో అంతరాలయానికి తోడ్కొని వెళ్లారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలను,చిత్ర పటాన్ని అందజేశారు.
దుర్గమ్మను దర్శించుకున్న పవన్ కళ్యాణ్ : —ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మూల నక్షత్రం పర్వదిన రోజున ఇంద్రకీలాద్రిపై కొలువైన సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న జగన్మాతను తన కుమార్తె ఆద్య తో కలిసి దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామరావులు ఆలయ అధికారులు, వేద పండితులు శాస్త్రోక్తంగా మేళ తాళాలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ లతో కలిసి దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం అందజేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గ తల్లిని మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఏడో రోజు మూలా నక్షత్ర శుభముహూర్తాన సరస్వతీదేవి అలంకారంలోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు వారికి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ప్రత్యేక జ్ఞాపికను, తీర్థప్రసాదాలను అందించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సిరిసంపదలు, సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు.
జగన్మాత చెంత కళావైభవం : మూలా నక్షత్రం రోజైన బుధవారం శ్రీ సరస్వతి దేవి అలంకారంలో జగన్మాత భక్తులకు దర్శనమిచ్చారు. ఇంతటి పుణ్యదినాన అమ్మవారికి భజన సంకీర్తనలు, సంగీతం, నృత్యం, హరికథలతో కళాకారులు పూజించారు. కనకదుర్గ నగర్ లోని కళావేదికపై నాగమణి బృందం, మీనాక్షి శ్రీనివాస్, సింధు బృందం, సాత్విక్ మహదేశ్వర్ ఆలపించిన భజన సంకీర్తనలు భక్తులను సమ్మోహన పరిచాయి. సిహెచ్ అజయ్ కుమార్,సింధూ నాగేశ్వరి బృందం ఆలపించిన సంగీత విభావరి అమ్మవారి భక్తులను పులకింపచేసింది. సిహెచ్ ఆనంద్, ఏం పావని, సంతోష్, భవాని, వి విజయలక్ష్మి, సాయిలిక్షిత, పవిత్ర, ఏ విజయలక్ష్మి, ఎం త్రినాధ చారి, పి మంజుష ప్రదర్శించిన నృత్యాలు అబ్బురపరిచాయి. జి జయరామ సుధాకర్ చెప్పిన హరికథ వీక్షకులను ఆధ్యాత్మిక చింతన కలిగేలా చేసింది. మూలా నక్షత్రం కావడంతో సరస్వతి దేవిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దర్శనం చేసుకున్న అనంతరం కళారూపాలను తిలకించిన భక్తులు పులకించిపోయారు.