Friday, December 20, 2024

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం కావడంతో ఆదివారం స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, పిల్లాపాపలతో కలిసి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో యాదాద్రి కొండతో పాటు కొండకింద కిటకిటలాడింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో నమోఃనారసింహ అంటూ శ్రీలక్ష్మీనారసింహున్ని స్మరిస్తూ భక్తజనులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో పూజా కైంకర్యాల ప్రారంభించారు. ఉదయం అష్టోత్తరం, అభిషేకం, నిత్యకల్యాణం, సువర్ణపుష్పార్చనతో పాటు ఆలయంలో జరిగినటువంటి శ్రీసత్యనారాయణ వ్రత పూజలలో సాయంత్రం నిర్వహించినటువంటి

వెండి జోడి మొక్కు సేవలలో భక్తులు పాల్గొని మొక్కుబడులు చెల్లించుకొని శ్రీలక్ష్మీనరసింహుని దర్శించుకున్నారు. రెండు రోజులుగా భక్తుల రద్దీ ఆలయానికి పెరగడంతో ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు దర్శనం క్యూలైన్లు, ప్రసాద క్యూలైన్లు, నిత్యకల్యాణం, కల్యాణకట్టలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు సుమారు 3 గంటల నుంచి 4 గంటల సమయం పట్టింది. కొండపైన కొలువైన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి వారిని భక్తులు దర్శించుకొని పూజలు నిర్వహించారు. యాదాద్రి అనుబంధ క్షేత్రమైన శ్రీపాతలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శించి దర్శించుకున్నారు.

ఆలయ నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిత్యరాబడిలో భాగంగా ఆదివారం రూ. 57,65,217 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ పరిధిలోని ప్రసాద విక్రయం ద్వారా రూ.19,17,960, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.3,46,100, వీఐపీ దర్శనం ద్వారా రూ. 7,05,000, బ్రేక్ దర్శనం ద్వారా రూ. 4,44,600, కొండపైకి వాహనాల అనుమతి ద్వారా రూ.7,00,000 లక్షలతో పాటు వివిధ శాఖలు, పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం నుంచి నిత్యరాబడి సమకూరినట్టు అధికారులు తెలిపారు.
శ్రీవారి సేవలో హైకోర్టు జడ్జి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ చిల్లకూరు సుమలత దర్శించుకున్నారు. ఆదివారం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన జస్టిస్ సుమలతకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News