Wednesday, December 25, 2024

సింగరాయ జాతరకు పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

కోహెడ ః సింగరాయ జాతర ప్రాంతం భక్తజనంతో నిండిపోయింది. సింగరాయ కొండకు కొండకు ఎటు చూసినా జనమే జనం… ప్రభంజనంలా భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు తరలి రావడంతో శ్రీశ్రీ ప్రతాప రుద్ర సింగరాయ లక్ష్మినరసింహస్వామి వెలిగిపోయాడు. కోహెడ మండలంలోని కూరెళ్ల, తంగళ్లపల్లి, గుండారెడ్డిపల్లి, బస్వాపూర్ గ్రామాల సరిహద్దులో శుక్రవారం సింగరాయ జాతర ప్రకృతి అందాల నడుమ కన్నుల పండుగగా, అంగరంగవైభవంగా జరిగింది. పకృతి అందాలను చూసిన భక్తులు పరవశించిపోయారు. ఈ జాతరకు సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలతోపాటు, ఫోలాపూర్, బీవండి ఇతర పట్టణాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు ఉదయన్నే జాతరకు వచ్చారు. అన్ని జాతరలకు బిన్నంగా ఒకే ఒక్క రోజు పుష్యబహుళ అమావాస్య రోజు జరిగే ఈ జాతర కేవలం భక్తిబావంతో పాటు విహారయాత్రను తలపించే విధంగా భక్తులు చేరుకున్నారు. పచ్చని చెట్లు, కొండల మధ్య సెలయేరు, మాఘమాస పిల్లగాలులను భక్తులు ఆస్వాదించారు. తూర్పు నుండి పడమరకు ప్రవహించే మోయ తుమ్మెద వాగు సెలయేరులో పవిత్ర స్నానం ఆచరించారు.

రెండు కిలోమీటర్ల దూరంలో ఎత్తు వంపు కొండలు ఎక్కి రాతిగుహలో కొలువుదీరిన శ్రీ లక్ష్మినరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్ళి మొక్కులు సమర్పించి, మమ్ములను మా కుటుంబాలను చల్లంగా చూడమని వేడుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. అనంతరం ప్రకృతి ఒడిలో చిక్కుడు, వంకాయ, టమాట వంటి కూరగాయల వంటలు చేసుకొని కుటుంబ సమేతంగా భోజనాలు చేశారు. హుస్నాబాద్ సిఐ కిరణ్ తహశీల్దార్ సురేఖ, ఎంపిడివో మధుసూదన్ ఆద్వర్యంలో రెవెన్యూ, పోలీసు, పంచాయతీ రాజ్ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు భక్తులు దర్శనం చేసుకుంటున్న తీరును పరిశీలించారు. అలాగే ఎంపివో సురేష్, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో కలిసి పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టారు. మొత్తం మీద ఒక్కరోజు జరిగిన జాతర “భక్తుల జోరుతో.. జాతర హోరెత్తిందని” చెప్పవచ్చు. పంచాయతీ రాజ్, పోలీసు, రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో “సింగరాయ జాతర”’ ప్రశాంతంగా ముగిసింది.

పోలీసుల నిఘా మధ్య ముగిసిన జాతర ః
సింగరాయ జాతరను హుస్నాబాద్ ఎసిపి వాసాల సతీష్ పర్యవేక్షించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. భారీగా తరలివచ్చిన భక్తుల భద్రతకు ఏలాంటి ఆటంకం కలగకుండా హుస్నాబాద్ సిఐ కిరణ్ నేతృత్వంలో దాదాపు 120 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే కోహెడ ఎస్‌ఐ చదువాల తిరుపతి క్యూలైన ్లవద్ద భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శించుకునేవిధంగా చర్యలు తీసుకున్నారు.
సరిహద్దు వివాదంతో అడుగు అడుగునా అసౌకర్యాలే..!
సింగరాయ జాతర సరిహద్దు వివాదం కూరెళ్ల, తంగళ్లపల్లి గ్రామాల మద్య కొనసాగుతుండటంతో భక్తులు అసౌకర్యానికి గురైనట్లు పలువురు తెలిపారు. సింగరాయ జాతర ప్రాంతానికి వెళ్లే రోడ్లు గుంతలమయమై, ముళ్ల చెట్లతో ఉండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని సరిహద్దు వివాదం తేల్చి “మళ్లోచే సింగరాయ జాతర ఫుల్ సౌకర్యాలతో” నిర్వహించాలని భక్త జనం “మన తెలంగాణ”తో చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News