Thursday, February 20, 2025

జనసంద్రంగా పెద్దగట్టు జాతర

- Advertisement -
- Advertisement -

ఓ లింగా…ఓ లింగా నామస్మరణ…భేరీల మోతలు…గజ్జెల చప్పుళ్లు, సంప్రదాయ నృత్యాలతో సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలంలోని పెద్దగట్టు పరిసరాలు మార్మోగుతున్నాయి. పెద్దగట్టు (గొళ్లగట్టు) లింగమంతుల స్వామి జాతరలో రెండోరోజు సోమవారం భక్తులు పోటెత్తారు. శివసత్తుల సిగాలు, కాళ్ల గజ్జెలు, భేరీల చప్పుళ్లు, కత్తులు, త్రిశూలాల విన్యాసాలతో యాదవులు రెండవ రోజు లింగమంతుల స్వామి మొక్కులు తీర్చుకునేందుకు పెద్దగట్టుకు భారీగా చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి దేవరపెట్టె పెద్దగట్టుకు చేరుకున్న అనంతరం యాదవుల కులదైవం లింగమంతుల స్వామికి బోనం చెల్లించేందుకు వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుండే బోనంతో స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం మధ్యాహ్నానికి ఇష్ట దైవానికి మొక్కలు చెల్లించుకుని బంధుమిత్రులతో విందు ఆరగించిన భక్తులు తమ తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణం ప్రారంభించారు. లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దగట్టుపై బారులు తీరారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దగట్టు జాతర ప్రతీక అని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ కమిటి మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోఆయన భక్తులతో కలసి భేరీ మోగించారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సమ్మక్క సారక్క తరువాత దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర అంతటి ప్రాశస్తం కలిగిందన్నారు. చరిత్రాత్మక సంప్రదాయాల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 16వ శతాబ్ధంలో మొదలైన ఈ జాతర పురాతన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింప చేస్తుందన్నారు. అటువంటి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జరిగేలా రెండేళ్లకు ఒక మారు జరుగుతున్న ఈ జాతరకు భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతరను పురస్కరించుకుని ఐదు కోట్ల నిధులను కేటాయించారని అన్నారు.

వివిధ రాష్ట్రాల నుండి 30 లక్షల పైచిలుకు భక్తులు ఈ పూజలలో పాల్గొంటారని అంచనా వేస్తున్నామని అన్నారు. అందుకు తగ్గట్టుగానే మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక సిబ్బందిని నియిమించామన్నారు. ఈ సందర్భంగా తాగునీరు. పారిశుద్ధం, విద్యుత్ సరఫరా, వైద్య సహాయం, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వాహనాల రద్దీతో ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా ఉండేందుకు గామను హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేశామన్నారు. ఆరోగ్య పరంగా అత్యవసర చికిత్సల నిమిత్తం ప్రత్యేక వైద్య బృందాలతోపాటు అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. తాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు, శుభ్రత కోసం ప్రత్యేకించి పారిశుద్ధ కార్మికులను నియమించారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఆలయ కమిటీ ఛైర్మన్ నరసయ్య యాదవ్, కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, కొప్పుల వేణారెడ్డి, నల్లగొండ ఎంపి రఘువీర్ రెడ్డి, ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News