హైదరాబాద్: వన దేవతలైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీసంఖ్యలో మేడారం వచ్చారు. తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గద్దెల చుట్టూ ఉన్న అడవిలో చెట్ల కింద భక్తులు భోజనాలు వండుకొని అక్కడే విడిది చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. సొంత వాహనాలు, ఆర్టీసి బస్సుల్లో తరలి వచ్చిన భక్తులు మొదటగా జంపన్న భాగంలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం వనదేవతలను దర్శించుకున్నారు.
వేలాదిగా తరలివచ్చిన భక్తులతో సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దల వద్ద భక్తులతో కిక్కిరిసిపోయాయి. సమ్మక్క సారలమ్మ వనదేవతలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులకు కొబ్బరికాయలు కొట్టి పసుపు, కుంకుమ చల్లి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెల చుట్టూ ఉన్న అడవిలో చెట్ల కింద భోజనాలు వండుకొని అక్కడే విడిది చేసి పిల్ల్లాపాపలతో సంతోషంగా గడిపి తిరుగు ప్రయాణం అయ్యారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ నిర్వాహకులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మరోవైపు ములుగు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గౌస్ ఆలం, ఏటూరు నాగారం ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సిరిశెట్టి సంకీర్త్ మరికొందరు అధికారులు ఆలయానికి వచ్చి సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు.