న్యూఢిల్లీ: గత నాలుగు దశాబ్దాలుగా విశిష్ట సేవలు అందిస్తున్న దేవరాణీ సోదరీ మణులకు జాతీయ ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం అందజేశారు. 2022 సంవత్సరానికి సంబంధించి మేజర్ జనరల్ స్మితా దేవరాణికి, 2023 సంవత్సరానికి బ్రిగేడియర్ అమితా దేవరాణికి అందాయని రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేవరాణీ సోదరీమణులు ఉత్తరాఖండ్ లోని కొట్‌ద్వార్ జిల్లాకు చెందిన వారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 1973లో ఈ అవార్డును నెలకొల్పింది. సమాజానికి విశిష్ట సేవలందించిన నర్సులు, నర్సింగ్ వృత్తిలో ఉన్నవారికి ఈ అవార్డు ప్రదానం చేస్తుంటారు. మేజర్ జనరల్ స్మితా దేవరాణి మిలిటరీ నర్సింగ్ సర్వీస్‌లో 1983 లో చేరారు.
2021 అక్టోబర్ 1 నుంచి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ ఎంఎన్‌ఎస్‌గా ప్రస్తుతం బాథ్యతలు నిర్వహిస్తున్న ఆమె ఆర్మీ ఆస్పత్రి (రీసెర్చి అండ్ రిఫెరల్ ) ప్రిన్సిపల్ మేట్రన్‌గా, ఎంఎన్‌ఎస్ బ్రిగేడియర్‌గా, సదరన్ కమాండ్ ఆస్పత్రి ప్రిన్సిపాల్ మేట్రన్‌గా, డైరెక్టర్ ఎంఎన్‌ఎస్ (అడ్మినిస్ట్రేషన్)గా బాధ్యతలు నిర్వర్తించారు. బ్రిగేడియర్ అమితా దేవరాణి 1986లో సర్వీస్‌లో చేరారు. ప్రస్తుతం సదరన్ కమాండ్ బ్రిగేడియర్ ఎంఎన్‌ఎస్‌గా 2021 సెప్టెంబర్ 1 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకు ముందు పుణె ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలజీ, ప్రిన్సిపాల్ కాలేజీ ఆప్ నర్సింగ్, ఆర్మీ ఆస్పత్రి కాలేజీ ఆఫ్ నర్సింగ్, కాలేజీ ఆఫ్ నర్సింగ్ వైస్ ప్రిన్సిపాల్‌గా, ఇండియన్ నావల్ హాస్పిటల్ షిప్ కాలేజీ ఆఫ్‌నర్సింగ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.