న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఇంజన్‌కు నిప్పంటుకున్న సంఘటనపై సమగ్ర దర్యాప్తు అనంతరం తగిన చర్యలు చేపడతామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిల) శనివారం తెలిపింది. శుక్రవారం రాత్రి ఇక్కడి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 184 మంది ప్రయాణికులతో బెంగళూరు బయల్దేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎ320 సిఇఓ విమానం ఒక ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో టేకాఫ్ కాకుండా ఆగిపోయింది. విమానంలోని ప్రయాణికులను వెంటనే సురక్షితంగా కిందకు దించివేసి వేరే విమానం ద్వారా ప్రయాణికులను రాత్రి 12 గంటల ప్రాంతంలో బెంగళూరుకు పంపించినట్లు డిజిసిఎ తెలిపింది. ఈ సంఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేసి విమానం ఇంజన్‌లో మంటలు చెలరేగడానికి గల కారణాలను నిర్ధారించవలసి ఉందని డిజిసిఎ అధిపతి అరుణ్ కుమార్ తెలిపారు. అదృష్టవశాత్తు వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని, ప్రస్తుతం ఈ విమానాన్ని గ్రౌండ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
DGCA Probe into Fire breaks out in flight Engine