న్యూఢిల్లీ : జబల్‌పూర్ విమానాశ్రయంలోని రన్‌వేపై మార్చి 12న ల్యాండ్ అయిన ఒక విమానం విషయమై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డిజిసిఎ) విచారణ జరిపింది. ఈమేరకు ఢిల్లీకి చెందిన అలయన్స్ ఎయిర్ ఏటీఆర్ 72 విమానం ఆరోజు జబల్‌పూర్ లో రన్‌వేని దాటి ల్యాండ్ అయింది. ఈ విమానంలో దాదాపు 55 మంది ప్రయాణికులు ఉన్నారు. దర్యాప్తులో ఈ విమానం రన్‌వే సమీపంలో చాలా సేపు ల్యాండ్ అవ్వకుండా గాల్లోనే ఉందని, రన్‌వేకి దాదాపు 900 మీటర్లు దాటి ల్యాండ్ అయ్యిందని తేలింది. అలాంటి విపత్కర సమయంలో మంటలు రాజుకునే అవకాశం పొంచి ఉందని డీజీసీఎ పేర్కొంది. ల్యాండింగ్ సమయంలో విమానం సరిగా స్థిరీకరించబడక పోతే వెంటనే గో అరౌండ్ కోసం అధికారులకు సమాచారం ఇవ్వాలి. కానీ ఆ పైలెట్లు ఇద్దరూ అవేమీ చేయకుండా ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసి ఏవియేషన్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఒక ఏడాది పాటు వేటు వేసింది.