ప్రపంచ పోలీస్ గేమ్స్ లో ఐదు పతకాలు సాధించిన శ్రీబాల
మన తెలంగాణ/హైదరాబాద్ : కెనడాలోని విన్నిపెగ్‌లో జూలై 28 నుండి ఆగస్టు 6 వరకు జరిగిన వరల్డ్ పోలీస్, ఫైర్ గేమ్స్ – 2023లో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో పతకాలు సాధించిన రాచకొండ రోడ్ సేఫ్టీ వింగ్ డిప్యూటీ కమీషనర్ బి శ్రీబాలను డిజిపి అంజనీ కుమార్ మంగళవారం ఘనంగా సత్కరించారు. ప్రపంచ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ లో పాల్గొన్న ఏకైక తెలంగాణ పోలీసు క్రీడాకారిణిగా పాల్గొని పతకాలు సాధించి రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చినందుకు శ్రీబాలని డిజిపి అభినందించారు. శాంతి భద్రతల పరిరక్షణకై నిరంతరం కృషి చేసే పోలీస్ శాఖకు శ్రీబాల పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. డిసిపి శ్రీబాల అసాధారణమైన నిబద్ధత, క్రీడల్లో ప్రదర్శించిన నిపుణత, కృషి ఆమెకు పతకాలు సాధించడంలో దోహదపడ్డాయని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డిజిలు అభిలాషా బిస్త్, సంజయ్ కుమార్ జైన్ పాల్గొని అభినందనలు తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల నుండి దాదాపు 8,000 అథ్లెట్లు ’లా ఎన్‌ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు 60 క్రీడలలో పోటీ పడ్డారు. టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్ 40 విభాగంలో రజత పతకాలు, 40+ మిక్స్‌డ్ డబుల్స్ లో, మహిళల సింగిల్స్‌లో శ్రీబాల కాంస్య పతకాలను గెలుచుకుంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ 40+లో బంగారు పతకం, 40+ మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకాన్నిశ్రీబాల గెలుచుకుంది. మొత్తంగా, ఆమె భారతదేశానికి ఒక స్వర్ణం మరియు రెండు రజత మరియు కాంస్య పతకాలతో సహా ఐదు పతకాలను గెలుచుకుంది. 2022 వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్, రోటర్ డామ్‌లో, ఆమె టేబుల్ టెన్నిస్‌లో రజత, కాంస్య పతకాలను గెలుచుకుంది.