Monday, December 23, 2024

డిజిపిని ఎపికి పంపించాలి

- Advertisement -
- Advertisement -

కలెక్టర్ అమోయ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలి
బిజెపి ఎంఎల్‌ఎ రఘనందన్ రావు డిమాండ్

మన తెలంగాణ, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన డిజిపి అంజనీ కుమార్‌ను వెంటనే ఆ రాష్ట్రానికి పంపించాలని బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మాజీ సిఎస్ సోమేష్ కుమార్ తరహాలో కొందరు అధికారులు సొంతక్యాడర్‌లో కాకుండా తెలంగాణలోనే కొనసాగుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే తెలంగాణలో పనిచేస్తోన్న ఎపి క్యాడర్‌కు చెందిన ఐఎఎస్, ఐపిఎస్ అధికారులపై పిఎంవోకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. శుక్రవారం బిజెపి కార్యాలయంలో మీడియాతో రఘునందన్ రావు మాట్లాడారు.. ఆలిండియన్ సర్వీస్ అధికారులు ఎక్కడ పోస్టింగ్‌లు ఇస్తే అక్కడికే వెళ్ళి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) నిర్ణయంతో 15 మందిని సొంత క్యాడర్‌కు పంపించకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.
కలెక్టర్ అమోయ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలి

మియాపూర్ భూ కుంభకోణంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ రావు కోరారు. సర్వే నెంబర్ 78కి సంబంధించిన భూముల కేటాయింపులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పక్షపాతి ధోరణి చూపించారని ఆరోపించారు. ఎనిమిది ఎకరాలు తీసుకున్న వ్యక్తికి ఒక న్యాయం, 40 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి మరో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖను ఆయన రాశారు. తమ లేఖనే ఫిర్యాదుగా పరిగణించి కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎనిమిది ఎకరాల విషయంలో కలెక్టర్ ఎస్‌పిఎల్‌ను దాఖలు చేశారని, అయితే 40 ఎకరాల విషయంలో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పి) వేయలేదన్నారు. 40 ఎకరాల ప్రభుత్వ భూమి విషయంలో ఎస్‌ఎల్‌పి వేసేలా చర్యలు తీసుకోవాలని సిఎస్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. తమకు పది రోజులు సమయమిస్తే మియాపూర్ భూకుంభకోణంపై మరింత సమాచారం ఇస్తామని రఘునందన్ రావు చెప్పారు. శుక్రవారం బిజెపి కార్యాలయం నుంచి సిఎస్‌కు ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ కావాలని ఆయన కోరారు. తమకు ఎప్పుడు అపాయింట్‌మెంట్ ఇచ్చినా కలుస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News