మనతెలంగాణ/హైదరాబాద్:నిర్మల్ జిల్లా బైంసాలో మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడిపై దర్యాప్తు, కేసు పర్యవేక్షణాధికారాన్ని మహిళా భద్రతా విభాగానికి అప్పగిస్తూ డిజిపి మహేందర్ రెడ్డి గురువారం ఆదేశాలిచ్చారు. మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి విషయంపై డిజిపి స్పందిస్తూ ఈ ఘటనపై పోలీస్ అధికారులు వెంటనే స్పందించి నిందితుడిని గుర్తించి కోర్టులో ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను శాస్త్రీయ పరంగా గుర్తించి, నిందితుడికి తగు శిక్ష పడేవిధంగా దర్యాప్తు ప్రక్రియను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని మహిళా భద్రతా విభాగాన్ని ఆదేశించామని వివరించారు. ఈ సంఘటను సీరియస్ గా తీసుకున్న డిజిపి దర్యాప్తును నిస్పాక్షికంగా, త్వరిత గతిన పూర్తిచేసి, నిందితుడికి శిక్ష పడేవిధంగా చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. బాధిత బాలికకు వైద్య సహాయం అందించడంతోపాటు, వారి కుటుంబ సభ్యులకు తగు ఆర్థిక సహాయాన్ని సంబంధిత ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో కృషిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో మహిళా భద్రతా విభాగం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తుందని డిజిపి తెలియచేశారు.
DGP Mahender reddy orders to probe on Bhainsa violence