మనతెలంగాణ/హైదరాబాద్/ములుగు క్రైం: హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ సహా ఇతరులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ నిర్ణయించారు. వెంటనే కేసుల ఎత్తివేతకు తగిన చర్యలు తీసుకోవాలని డిజిపి అంజనీకుమార్‌ను సిఎం ఆదేశించారు. మావోయి స్టు కార్యకలాపాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై హరగోపాల్‌తో పాటు ఇతర ప్రజాసంఘాల నేతలపై ఉపా చట్టం కింద ములుగు జిల్లా తాడ్వాయిలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి తప్పు చేయక పోయినా, ఆధారాలు లేకుండా ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం దారుణమని, వెంటనే వారిపై నమోదు చేసిన కేసు ఎత్తివేయాలని రాజకీ య ప్రజాసంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.
ఈ నేపథ్యం లో అన్ని అంశాలను పరిశీలించిన సిఎం కెసిఆర్ హరగోపాల్ సహా ఇత రులపై నమోదు చేసిన కేసుల ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్నారు.ప్రొ. హరగోపాల్‌తో 152మంది ఉద్యమకారులు, మేధావుల పై 2022, ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో దేశద్రోహం కేసు నమోదైంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆ యుధాల చట్టం, భారత శిక్షాస్మృతిలోని 10 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. నిందితులుగా ఉన్న వారిలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్, ప్రొఫెసర్ పద్మజా షా, హైకోర్టు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్, చిక్కుడు ప్రభాకర్ తదితరుల పేర్లు ఉన్నాయి.
దేశం ద్రోహం కేసు ఉపసంహరణ : ములుగు ఎస్‌పి గాష్ ఆలం
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో గతేడాది ప్రొఫెసర్ హరగోపాల్ తో పాటు ఇతరులపై నమోదైన దేశద్రోహం కేసు ఉపసంహరించుకున్నట్లు ములుగు జిల్లా ఎస్‌సి గాష్ ఆలం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మావోయిస్టులు, మిలీషియా సభ్యులు ప్రభుత్వ అధికారులను, అమాయకులను లక్షంగా చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని, పౌరులు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, అమాయక గిరిజన యువకుల నియామకం నిధుల సేకరణ కోసం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న సిపిఐ మావోయిస్టుల కోసం అప్పట్లో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఆలివ్ గ్రీన్ యూనిఫారంలో నిషేధించబడిన సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన సాయుధ వ్యక్తులు పోలీసు పార్టీ గమనించి వారిని లొంగిపోవాలని కోరామని,
వారు తమ గుడారాన్ని ఖాళీ చేస్తూ అక్కడి నుండి దట్టమైన అడవిలోకి పారిపోగా, పోలీసులు సమావేశ స్థలాన్ని కనుగొన్నారని చెప్పారు. అక్కడ ఒక టెంట్ ఉన్నట్లు గుర్తించి,అక్కడ ఉన్న వెళ్లి చూడగా 3 కిట్ బ్యాగులు, ఒక సోలార్ ప్లేటు, 5 వాటర్ క్యాన్‌లు, 7 వాటర్ బాటిల్ లు, 2 స్టీల్ బ్యాగులు, ఒక తాడు, ఒక కత్తి, 2 నల్లరేకులు, 2 బియ్యం గిన్నెలు, 2 బస్తాలు, ఒక లైటర్, 2 ప్లాస్టిక్ గ్లాసులు, 3 గొడుగులు, సిపిఐ మావోయిస్టు సాహిత్యం వంటి వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పస్రా సిఐ శంకర్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించిన అనంతరం తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో 152 మంది నిందితులపై ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మావోయిస్టు నాయకులు వారి సానుభూతి పరులు, మావోయిస్టు సాహిత్యంలో పేర్లు ఉన్న ఇతర వ్యక్తులను నేరం జరిగిన ప్రదేశం నుండి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన అనంతరం
ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. తాడ్వాయి మండలంలోని అటవీ ప్రాంతంలో తప్పించుకున్న మావోయిస్టులను పట్టుకోవడానికి కూంబింగ్ కార్యకలాపాలు ప్రారంభించామని, విచారణలో కేసుకు సంబంధించిన వాస్తవాలతో పరిచయం ఉన్న సాక్షుల వాంగ్ములాలు నమోదు చేసి, మరిన్ని ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో ప్రొఫెసర్ హరగోపాల్, పద్మజా షా, వి.రఘునాధ్ రెడ్డి, గడ్డం లక్ష్మణ్, గుంటి రవిందర్, సురేష్ కుమార్‌లపై తగిన ఆధారాలు లేవని తేలిందని, కాబట్టి ఈ కేసులో వారి పేర్లు తొలగింపునకు న్యాయస్థానంలో అభ్యర్థనతో మెమో దాఖలు చేసినట్లు తెలిపారు.