ఉచితాలు, సబ్సిడీలపై సభలో పకడ్బందీ చర్చ జరగాలని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ బుధవారం అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెట్టుబడులు అన్నిటినీ విస్తృత శ్రేయస్సుకు దోహదపడేలా ఒక జాతీయ విధానాన్ని రూపొందించవలసిన తక్షణ అవసరం ఉందని ఆయన సూచించారు. అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాల కోసం పార్లమెంట్ సభ్యుల వద్ద నిధులను ప్రస్తుత ఐదు కోట్ల రూపాయల నుంచి ఏడాదికి రూ. 20 కోట్లకు పెంచాలని జీరో అవర్‌లో సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) సభ్యుడు రామ్‌గోపాల్ యాదవ్ చేసిన అభ్యర్థనకు ధన్‌ఖడ్ స్పందిస్తూ, ప్రభుత్వం, ప్రతిపక్షం అంగీకరించినట్లయితే ఈ అంశంపై పకడ్బందీ చర్చకు తాను సుముఖుడినేనని చెప్పారు. ఉచిత విద్యుత్, నీరు, సబ్సిడీ ధరకు వంట గ్యాస్ సరఫరా, రైతులు, మహిళలు వంటి కొన్ని బృందాలకు నగదు పంపిణీ వంటి ఎన్నికల ఉచితాల ప్రకటనను ప్రభుత్వంపై ఆర్థిక భారాలు మోపుతాయని, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తాయని, దీర్ఘకాలిక అభివృద్ధి లక్షాలకు హానికరమని తరచు విమర్శలు వస్తున్న విషయం విదితమే.
‘ఉచితాలుగా తరచు పేర్కొంటున్న సంతృప్తిపరచే విషయాలపై ఈ సభ చర్చించవలసిన అగత్యం ఉంది. సభా నాయకుని, ప్రతిపక్ష నాయకుని సంప్రదించిన తరువాత పకడ్బందీ చర్చకు నేను సుముఖుడిని’ అని సభాధ్యక్షుడు చెప్పారు. మూలధన వ్యయానికి ద్రవ్యం అందుబాటులో ఉన్నప్పుడే దేశం వృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ‘ఎన్నికల ప్రక్రియ ఎలా ఉందంటే ఇవి వోటర్లను ప్రలోభపెట్టేవిగా మారాయి. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నట్లు గ్రహిస్తాయి. అవి తమ ఆలోచనలను మార్చుకోవలసి ఉంటుందని అనుకుంటుంటాయి’ అని ధన్‌ఖడ్ పేర్కొన్నారు. ‘ఏ రూపంలోనైనా ప్రభుత్వ పెట్టుబడులు అన్నిటినీ విస్తృత శ్రేయస్సు కోసం పకడ్బందీ తరహాలో ఉపయోగించేలా ఒక జాతీయ విధానాన్ని రూపొందించవలసిన తక్షణ అగత్యం ఉంది’ అని ఆయన సూచించారు. ఉభయ పక్షాల నేతలు అంగీకరించినట్లయిత చర్చించవచ్చునని ఆయన అన్నారు.
ఇది అత్యంత తీవ్ర విషయమని ధన్‌ఖడ్ పేర్కొన్నారు. అటుపిమ్మట ధన్‌ఖడ్ సబ్సిడీల అంశాన్ని ప్రస్తావించారు. ‘వ్యవసాయ రంగం వంటి రంగాల్లో కావలసి ఉంటే సబ్సిడీలను నేరుగా అందజేయాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరించే పద్ధతి అదే’ అని ఆయన చెప్పారు. రెండు పక్షాలు అంగీకరిస్తే ఇది కూడా చర్చించవలసిన అంశమే అని ధన్‌ఖడ్ చెప్పారు. అంతకు ముందు రామ్‌గోపాల్ యాదవ్ మాట్లాడుతూ. ఎంపిల్యాడ్ నిధిని రూ. 20 కోట్లకు పెంచాలని, జిఎస్‌టి నుంచి మినహాయించాలని, అంచనాలు, జరిగిన పని నాణ్యత పరిశీలన కోసం ఒక సాంకేతిక విభాగాన్ని సృష్టించాలని కోరారు.