రైతుల హక్కులను హరించేలా రూపొందించిన ధరణి చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ధరణీని బంగాళాఖాతంలో కలిపేస్తాం.. 1.57 కోట్ల ఎకరాల భూమిని విదేశీ సంస్థలకు గత ప్రభుత్వం తాకట్టు పెట్టింది.. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ధరణి స్థానంలో సమస్త భూమి హక్కులకు రక్షణగా నిలిచే సరికొత్త రెవెన్యూ చట్టం ‘భూభారతి’ తీసుకొస్తాం.. ప్రతీ పేదవానికి ఉన్న ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడుతాం..’ సరిగ్గా గత ఎన్నికల ముందు ఈ మాటలు అన్నది మరెవరో కాదు… నేటి రాష్ట్ర రెవెన్యూ మంత్రి, పాలేరు శాసనసభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నాడు అన్న మాటలు అన్నట్టుగానే ధరణి పోర్టల్‌లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అనేక అంశాలతో కూడిన సరికొత్త ఆర్‌ఒఆర్ చట్టం భూభారతిని పట్టాలెక్కించేందుకు సర్వంసిద్ధమైంది.
భారత రత్న డా. బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఏప్రిల్ 14వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు మీదుగా కొత్త చట్టంతో పాటు భూభారతి పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. ఫలితంగా ప్రస్తుతం అమల్లో ఉన్న ‘ధరణి’ స్థానంలో భూ-భారతి పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. ఆ తేదీ తర్వాత.. భూభారతి పోర్టల్ ద్వారానే క్రయవిక్రయాలు జరుగుతాయి. ప్రస్తుత ప్రభుత్వం చెపుతున్నట్టుగా పార్ట్ బి లోని 18 లక్షల ఎకరాల, కాస్తులోని మరో 9 లక్షల ఎకరాల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతిని రూపొందించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెపుతున్నారు. 2020 నవంబర్ 10 నాటికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 9.24 లక్షల సాదాబైనామా దరఖాస్తులకు శాశ్వత పరిష్కారం చూపాలన్నది ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా ఉంది.
అందుకోసమే ముందస్తుగా ఇప్పటికే రాష్ట్రంలోని 10,954 రెవెన్యూ గ్రామాలకు ఒక్కో గ్రామానికి ఒక గ్రామ పాలన ఆఫీసర్‌ను నియమించేందుకు ఇప్పటికే వేగంగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా రెవెన్యూ వ్యవస్థలో మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి లో నాలుగంచెల వ్యవస్థను రూపొందించి ఆయా వ్యవస్థల ద్వారా ఎక్కడికక్కడే భూసమస్యలకు పరిష్కారం చూపాలన్నది ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. గత సంవత్సర కాలంలో తెలంగాణ ప్రభుత్వం భూ భారతిపై అనేక విధాలుగా అధ్యయనం చేసిందనే చెప్పాలి. గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టడంతో ప్రధానమైన ఎన్నికల హామీగా ఉన్న ధరణి పోర్టల్ రద్దు, ఆ పోర్టల్ స్థానంలో భూ భారతి చట్టం 2025ను అమలులోకి తీసుకొస్తామని చెప్పడంతో ఆ చట్టం పటిష్టంగా రూపొందించేందుకు గాను ఏకంగా 18 రాష్ట్రాలలోని అమలులో ఉన్న ఆర్‌ఒఆర్ చట్టాలను అధ్యయనం చేసి అందులోంచి అత్యుత్తమ నివేదికలు రూపొందించి భూభారతి చట్టాన్ని రూపొందించింది.
ఇప్పటికే శాసనసభ ఆమోదముద్ర వేయగా గవర్నర్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఫలితంగా తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు ఉండనున్నాయి. భూభారతి చట్టంలో అనేక కొత్త మార్పులు తీసుకొచ్చారు. అధునాతంగా అరచేతిలో సెల్ ఫోన్‌తో తమ భూమి వివరాలు ఎప్పటికప్పుడు చూసుకునేలా ఏర్పాట్లుచేశారు. భూసమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి గతంలో ధరణి పోర్టల్లో 33 మాడ్యూళ్లు ఉండేవి. అయితే భూభారతిలో ఈ విధానాన్ని సులభతరం చేశారు. మాడ్యూళ్ల సంఖ్యను 33 నుంచి ఆరుకు కుదించారు. ప్రతి మనిషికి ఆధార్ ఉన్నట్టుగానే ప్రతీ భూకమతానికి భూఆధార్ ఉండనుంది. హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటారు.
ఈ చట్టం ప్రకారం గ్రామకంఠం, ఆబాదీలపై కూడా హక్కులను కట్టబెట్టనున్నారు. భూసమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. 11 కాలమ్‌లతో కొత్త పహాణీని ఏర్పాటు చేయనున్నారు. ఈనూతన చట్టం ప్రకారం మ్యుటేషన్‌కు మ్యాప్ తప్పనిసరిగా ఉంటుంది. వారసత్వ భూముల విషయంలో తప్పులు జరగకుండా చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయి విచారణ తర్వాతే ప్రక్రియ ముందుకు సాగుతుంది. నిర్ణీత కాలంలో విచారణ చేసిన తర్వాతనే పాస్ పుస్తకాలు జారీ అవుతాయి.గతంలో స్థానికంగా భూసమస్యలను పరిష్కరించే వీలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు.అందుకే లక్షల ఎకరాల భూవివాదాలు తెరమీదకు వచ్చాయి.
కానీ భూభారతి చట్టం ద్వారా నాలుగంచెల వ్యవస్థలో ఏదైనా భూ వివాదంపై తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ పరిష్కారం కాకపోతే 60 రోజుల్లో ఆర్‌డిఒకు అప్పీల్ చేసుకునే వీలు ఉంటుంది. భూముల క్రయవిక్రయాల విషయంలో తహశీల్దార్- జాయిట్ సబ్ రిజిస్ట్రార్‌కు సమర్పించే భూదస్త్రాలతోపాటే భూమి సర్వే, సబ్ డివిజన్ సర్వే మ్యాప్‌ను తప్పనిసరిగా జోడించాల్సి ఉంటుంది. సర్వే మ్యాప్ లను కూడా భద్రపరుస్తారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారు. ఇందుకోసం జిల్లాల్లో న్యాయ సహాయ కేంద్రాల ఏర్పాటు చేస్తారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించి గ్రామస్థాయిలో భూసమస్యల పరిస్కారానికి అవకాశం కల్పిస్తారు. భూభారతి చట్టం అమలు విజయవంతం కావడానికి గాను ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అనతి కాలంలో రెవెన్యూ శాఖలో పూర్వవైభవం తీసుకొచ్చేలా కసరత్తు చేసింది.
తొలిసారిగా 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల ఏర్పాటు, గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు గ్రామానికో అధికారిగా 10,954 పోస్టుల ఏర్పాటు. విఆర్‌ఎ, విఆర్‌ఒలను ఆప్షన్ పద్ధతిలో తిరిగి మాతృశాఖలోకి తీసుకోవడం, రాష్ట్రంలో కొత్త డివిజన్లు, కొత్త మండలాలలో పోస్టుల మంజూరు, జూనియర్ అసిస్టెంట్ల నుంచి డిప్యూటీ కలెక్టర్లు వరకు పదోన్నతులు, తహశీల్దార్లు, ఆర్‌డిఒలు, జెసిలు గతంలో కోల్పోయిన అధికారాలను భూభారతి చట్టం- 2025తో పునరుద్ధరణ ఇలా వివిధ అంశాలలో రేవంత్ రెడ్డి సర్కారు భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నూతన ఆర్‌ఒఆర్ చట్టం ద్వారా 14 రకాల భూమి హక్కులకు రక్షణగా నిలిచేలా సరికొత్త చట్టం రూపొందించారు. గత నాలుగేండ్లుగా రెవెన్యూ వ్యవస్థ నుండి వేరుపడి చెట్టుకొకరు పుట్టకొకరుగా వివిధ ప్రభుత్వశాఖలకు బదిలీ అయిన విఆర్‌ఎ, విఆర్‌ఒలు మళ్లీ గ్రామాల్లో కీలక పాత్ర పోషించి గ్రామ స్థాయి నుండే రెవెన్యూ సేవలు అందించేందుకు రంగం సిద్ధం అయింది.
– వనం నాగయ్య 94418 77693