Saturday, December 28, 2024

తెలంగాణలో భూకేంద్రీకరణ భూమికి దూరమైన పేదలు!

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల గ్రామీణ కుటుంబాలకు సాగు భూమి లేదని, వీరిలో దళిత కుటుంబాలు ఎక్కువని, వీరంతా కూలి పనులు చేసుకొంటున్నారని ధరణి కమిటీ రిపోర్టులో పేర్కొంది. ఈ కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూములు పంపిణీ చేయటం కాకుండా ఏటా రూ. 12 వేల ఆర్థిక సహాయం అందించే ఆలోచన చేస్తున్నది. భూమికి గ్రామీణ ప్రజలకు విడదీయరాని బంధం ఉంది. రైతుకు సమాజంలో హోదా, గౌరవాన్ని ఇచ్చేది సేద్యపు భూమే. అంతటి ప్రాధాన్యత ఉన్న భూమి కొద్ది వ్యక్తుల వద్ద ఎక్కువగా పోగుపడి ఉంది. అత్యధిక మంది పేదలు భూమికి దూరమయ్యారు. నేడు తెలంగాణలో 65 లక్షల మంది రైతులు ఉన్నారు. సేద్యపు భూమి కోటి 52 లక్షలు ఉంది.

73% మంది రైతులు 2.5 ఎకరాల కన్నా తక్కువ భూమి కలిగి ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికార లెక్కల ప్రకారం లక్ష లోపు జనాభా కలిగి ఉన్న వారి వద్ద 14.97 లక్షల ఎకరాల భూమి ఉంది. మూడు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు 42.22 లక్షల మంది ఉంటే, వారి వద్ద 60.60 లక్షల ఎకరాల భూమి ఉంది. మూడు నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు 10.08 లక్షల మంది ఉండగా, వారి వద్ద 40 లక్షల ఎకరాల భూమి ఉంది. ఐదు నుంచి 10 ఎకరాలు ఉన్న వారు 4.65 లక్షల మంది రైతులు ఉండగా, వారు 30.94 లక్షల ఎకరాలు కలిగి ఉన్నారు. 20 ఎకరాల భూమి ఉన్న రైతులు 84,606 మంది ఉండగా, వారి వద్ద 11.09 లక్షల ఎకరాల భూమి ఉంది.

20 ఎకరాల పైన ఉన్న భూకామందులు 14.46 వేల మంది ఉంటే వారి వద్ద 3.87 లక్షల ఎకరాల భూమి ఉంది.ఈ గణాంకాలను గమనిస్తే భూస్వాములు, ధనిక రైతుల వద్ద భూకేంద్రీకరణ ఎక్కువగా ఉందని, చిన్న, సన్నకారు రైతులు తక్కువ భూమి కలిగి ఉన్నారని, అసలు సెంటు భూమి లేని పేదలు 25 లక్షల మంది ఉన్నారని వెల్లడవుతుంది. దేశంలో బ్రిటిష్ వలసపాలన కాలంలోనే భూమి కోసం అనేక పోరాటాలు జరిగాయి. వాటిల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ప్రపుల్లవాయలర్ రైతుల భూపోరాటం ముఖ్యమైన భూపోరాటాలు. నిరంకుశ నిజాం పాలనకి, ఆ పాలనకు మూలస్తంభాలుగా ఉన్న జమీందార్ల, జాగీర్‌దార్ల పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన నీబాంచన్ దొర అన్న కూలీలు, పేదలు, రైతులు సంఘటితమై వెట్టిచాకిరీ, దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, భూమికోసం 1946లో సాయుధ తిరుగుబాటు చేసి 1951 వరకు కొనసాగించారు.

10 లక్షల ఎకరాల భూములు స్వాధీనం చేసుకుని పంపిణీ చేసుకున్నారు. వేలాది గ్రామాల్లో ప్రజాపాలన ఏర్పడింది. ఈ పోరాటంలో 4 వేల మంది కమ్యూనిస్టు పార్టీ ముద్దుబిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రజల ప్రధాన మౌలిక సమస్య అయిన భూమి సమస్యను ముందుకు తెచ్చింది. భూపోరాటాలకు భయపడిన నెహ్రూ ప్రభుత్వం 1947 నవంబర్ 28న జమీందారీ విధానం రద్దు బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. 1948లో వ్యవసాయ సంస్కరణలపై కుమారప్ప కమిటీని వేసింది. ఈ కమిటీ 1949లో తన నివేదిక అందచేసింది. అందులో కొన్ని సూచనల చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు 1949లో హైద్రాబాద్ జాగీర్‌దార్ల రద్దు చట్టాన్ని చేసింది. 1950లో సంస్థానాలను రద్దు చేసి ఒక్కో సంస్థానానికి 18 కోట్లు భరణంగా ఇచ్చింది. వీటి కింద లక్షలాది ఎకరాలు భూములు ఉన్నాయి.

ఈ భూములు పేదలకు దక్కలేదు. రైతుల పేరుతో కొందరు పొంది భూస్వాములుగా మారారు. కౌలు సంస్కరణలు: కుమారప్ప కమిటీ సూచనలకు అనుగుణంగా వ్యవసాయం చేయని భూయజమానుల దోపిడీ నుండి కౌలుదారులకు రక్షణ కల్పించటం పేరుతో 1950 తెలంగాణ కౌలుదారీ చట్టం చేశారు. వివిధ చారిటబుల్ మత సంబంధమైన ఈనాం భూములకు (వీటి కింద లక్షల ఎకరాల భూమి ఉంది) తప్ప ఈ చట్టం అన్నిరకాల భూములకు వర్తిస్తుంది. 1933 నుంచి 1943 మధ్యకాలంలో వరుసగా ఆరు సంవత్సరాలు కౌలుకు చేస్తున్న వారిని రక్షిత కౌలుదారులుగా చట్టం గుర్తించింది. రక్షిత కౌలుదారునికి సేద్య అవసరాల కోసం భూమిని బ్యాంకుల తనకాపెట్టే హక్కు కల్పించబడింది. నిబంధనలు ప్రకారం కౌలు చెల్లించినంతకాలం కౌలుదారుగా కొనసాగుతాడు. కౌలు చెల్లించకపోతే కౌలు ఒప్పందం రద్దు అవుతుంది. భూయజమాని సొంత సేద్యం చేసుకునేందుకు చట్టంలో హక్కు కల్పించారు. ఈ హక్కుతో సొంత సేద్యం పేరుతో భూకామందులు కౌలుదారులను భూముల నుండి తొలగించారు. ఆచరణలో కౌలు దారీ చట్టం అలంకార ప్రాయంగా మారింది.

ఎటువంటి హక్కులు లేకుండా కౌలుదారులు అధిక కౌలుతో నేడు కౌలు సేద్యం చేస్తున్నారు. భూకమతాల పైగరిష్ట పరిమితి: భూకేంద్రీకరణను, ఆర్థిక, సాంఘిక అసమానతలను తగ్గించడానికని భూకమతాలపై గరిష్ఠ పరిమితి విధించారు. దీన్ని అమలు చేయటానికి హైద్రాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ నియమించబడింది. ఈ కమిటీ భూకమతాల గరిష్ట పరిమితికి కొన్ని సూచనలు చేసింది. 1. వ్యవసాయదారులకు నెలకు 150 రూపాయలు వచ్చే విధంగా వివిధ ప్రాంతాల్లోని భూములను ఆర్థిక కమతంగా గుర్తించాలి. 2. రెండు ఎకరాల మాగాణి లేదా 15 ఎకరాల మెట్టభూమిని బేసిక్ ఆధారంగా కమతం గరిష్ఠ పరిమితిని నిర్ణయించాలి.గరిష్ఠ పరిమాణం ఆర్థిక కమతానికి 5 రెట్లు ఉండాలని సూచించింది. కమిటీ సూచనల ప్రకారం మధ్యవర్తుల తొలగింపు చట్టం, జమీందార్ల, జాగీర్దార్లను తొలగించటం వరకే పరిమితమైంది. కౌలుదారులకు రక్షణ ఏర్పడలేదు. భూ కేంద్రీకరణలో అంకెలు మాత్రమే మారాయి.

తెలంగాణ రైతాంగ పోరాటం తర్వాత నక్సల్‌బరీ గిరిజన రైతాంగ పోరాటం, శ్రీకాకుళం గిరిజన రైతాంగ ఉద్యమం మరలా భూ సమస్యను ఎజండాలోకి తెచ్చాయి. వ్యవసాయ కూలీల్లో, పేద రైతుల్లో భూమి సాధించుకోవాలనే పట్టుదల రోజురోజుకి పెరిగింది. ఈ వాస్తవాన్ని గ్రహించిన ఆనాటి ఇందిరా ప్రభుత్వం, భూపోరాటాలను దారి మళ్లించేదుకు పూనుకుంది. 1970లో ముఖ్యమంత్రుల సమావేశంలో మన రాజకీయ వ్యవస్థ రక్షించబడాలంటే భూసంస్కరణల చట్టం చేయకతప్పదని ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ చెప్పింది. భూపరిమితికి ఐదుగురు సభ్యుల కుటుంబాన్ని యూనిట్ తీసుకోవాలి. సంవత్సరానికి రెండు పంటలు పండే భూమి 10 నుంచి 18 ఎకరాలు, మెట్ట భూమి 27 ఎకరాలు గరిష్ఠ పరిమితిగా కాఫీ, తేయాకు, రబ్బరు, కోకో మొదలైన తోటలు పండించే తోటలకు చట్టం నుంచి మినహాయింపు ఇచ్చి, నూతన సవరణలతో భూసంస్కరణ చట్టాలను డిసెంబర్ 31, 1972 నాటికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాలని ఆదేశించింది.

కేంద్రం ప్రభుత్వ సూచనల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1972 మే భూపరిమితి కుదిస్తూ ఆర్డినెన్స్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వాలు కూడా మిగులు భూములను తక్కువగా ప్రకటించాయి. దేశంలో 1961-72 మధ్య మిగులు 23 లక్షలుగా ప్రకటించింది. జాతీయ స్థాయిలో ఒకే సీలింగ్ విధానం రూపొందించిన తర్వాత 67 లక్షలుగా మిగులు భూమిగా ప్రకటించగా, ప్రభుత్వ విధానాలు, పాలసీలపై పరిశోధన, క్రమశిక్షణ నిమిత్తం ఏర్పాటైన లాల్ బహుదూర్ శాస్త్రి అకాడమి దేశం మొత్తం మిగులు భూమి 5 కోట్ల 20 లక్షల ఎకరాలు ఉంటాయని అంచనా వేసింది.

దేశంలో పాలకులు ప్రకటించిన 67 లక్షల ఎకరాల మిగులు భూమిలో 33 లక్షల ఎకరాలు స్వాధీనం చేసుకుని అందులో 11 లక్షల ఎకరాల లోపు మాత్రమే పేదలకు పంచారు. దేశంలో 15 కోట్ల 50 లక్షల సాగుభూమి ఉంటే, 67 లక్షలు మాత్రమే స్వాధీనం చేసుకుని, 11 లక్షల ఎకరాలు మాత్రమే పంపిణీ జరిగిందంటే భూసంస్కరణలు ఎంత బూటకంగా మారింది అర్ధమవుతుంది. శాసనసభ సభల్లో భూస్వామ్య వర్గ ప్రతినిధులు ఎక్కువగా ఉండటం, ప్రభుత్వాలు కూడా భూస్వామ్య వర్గ ప్రయోజనాలు కాపాడేవి కావటమే అందుకు కారణం.

తెలంగాణలో పేదలకు భూ పంపిణీ చేయటానికి భూమి ఎక్కడ ఉందని కొందరు అంటున్నారు. భూమి పెద్ద మొత్తంలో నయా జమీందార్ల వద్ద ఉంది. 1973 భూసంస్కరణల చట్టం అమలు జరగకపోవటం వల్ల భూకామందుల వద్ద లక్షలాది ఎకరాల మిగులు భూమి ఉంది. గృహ నిర్మాణాలకు మించి రియల్ ఎస్టేట్‌దారుల వద్ద ఉంది. దేవాలయ, మత సంస్థల వద్ద వేల ఎకరాల భూమి ఉంది.రాష్ట్రంలో బంజరు, ఫారెస్టు బంజరు భూములు ఉన్నాయి. భూ సంస్కరణలు అమలు జరపటం ఇష్టంలేని రాష్ట్ర పాలకులు ఈ భూములను పేదలకు పంచే విధానాలు అమలు చేయలేదు. తెలంగాణ గ్రామీణ పేదలు అందరూ భూములు పంపిణీ కోసం ఉద్యమించాలి.

బొల్లిముంత
సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News