Friday, November 22, 2024

10లక్షల లావాదేవీలు

- Advertisement -
- Advertisement -
Dharani portal completes one year

లక్షా80వేల ఎకరాలకు పాస్‌పుస్తకాలు

విజయవంతమైన ధరణి, ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సిఎం కెసిఆర్ హర్షాతిరేకం, ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న పోర్టల్ అని ప్రకటన
ధరణి అవతరణతో రాష్ట్రంలో
574 తహసీల్దార్
కార్యాలయాలకు విస్తరించిన
భూముల రిజిస్ట్రేషన్
కార్యకలాపాలు వెబ్‌పోర్టల్‌కు
5.17కోట్ల హిట్‌లు
అన్ని జిల్లాల కలెక్టర్లకు సిఎం
అభినందన బుక్ చేసిన స్లాట్‌లు : 10,45,878
పూర్తయిన లావాదేవీలు : 10,00,973 గిఫ్ట్ డీడ్‌లు : 1,58,215, వారసత్వం : 72,085, పరిష్కరించిన ఫిర్యాదులు : 5.17లక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ధరణి పోర్టల్’కు ఏడాది నిండింది. ధరణి విజయవంతంపై సిఎం కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. దేశంలోనూ విన్నూతంగా ప్రారంభించిన ఈ పోర్టల్ గత సంవత్సరం అక్టోబర్, 29వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. వినూత్నమైన ఈ ప్రాజెక్టును భూములకు రక్షణ కల్పించడం, ఎవరూ టాంపర్ చేయకుండా పటిష్టంగా రూపొందించారు. అలాగే ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు ఎలాంటి జాప్యం లేకుండా రెవెన్యూ అధికారులు చాలా సులభంగా భూముల వివరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వ్యవసాయం, ఇతర సంబంధిత భూములకు సంబంధించిన లావాదేవీలను ధరణి పోర్టల్‌తో పరిష్కరించేలా దీనిని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు ధరణి భూముల రిజిస్ట్రేషన్ సందర్భంగా ప్రజలకు ఇంటివద్దకే వచ్చి సేవలు అందించేలా ఈ పోర్టల్‌ను తీర్చిదిద్దారు.

గతంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు జరిగేవి. కానీ ధరణి రాకతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 574 తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మొత్తానికి భూ పరిపాలనలో ధరణి ఒక బెంచ్‌మార్క్‌గా రూపొందిందని అధికారులు, ప్రజలు పేర్కొంటున్నారు. గత సంవత్సర కాలంలో ధరణి పోర్టల్ ద్వారా 5.17 కోట్ల విలువ గల 10 లక్షల లావాదేవీలు జరగ్గా ధరణి ద్వారా 1,80,000 ఎకరాల భూములకు సంబంధించి పట్టాదార్ పాసు పుస్తకాలను అధికారులు జారీ చేశారు. ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్, విచక్షణ లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్‌గా పేరు సంపాదించింది. భూమి సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని ప్రస్తుతం అందిస్తోంది.

ఈ ఏడాదిలో ధరణి వెబ్ పోర్టల్ 5.17 కోట్ల హిట్‌లను సాధించగా, ధరణి ద్వారా దాదాపు 10 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయి. నిత్యం పెరుగుతున్నమార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకునే సామర్థ్యం ధరణి కలిగిఉంది. ఎప్పటికప్పుడు, స్టేక్ హోల్డర్ ల నుంచి సలహాలు, సూచనలకనుగుణంగా సరికొత్త లావాదేవీల మాడ్యూల్స్ జతపరిచారు. వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించడానికి సైతం ప్రత్యేక మాడ్యూల్స్ ధరణి పోర్టల్‌లో పొందుపరచారు. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయి.

అన్ని జిల్లాల కలెక్టర్‌లకు సిఎం అభినందన

ధరణి ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ధరణి సేవలను విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందాన్ని, అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అభినందించారు. ధరణి అందిస్తున్న పారదర్శకమైన, అవాంతరాలు లేని సేవలతో పౌరులు, ముఖ్యంగా వ్యవసాయదారులు, రైతులు ఎంతో ప్రయోజనం పొందారని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. రానున్న నెలల్లో ధరణి పౌరుల సేవలో మరిన్ని విజయాలు సాధిస్తుందని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ధరణిని విజయవంతంగా అమలు చేసినందుకు అధికారులు, జిల్లా కలెక్టర్లు, తహశీల్దార్లకు ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

ధరణి పురోగతి వివరాలు ఇలా….

హిట్‌ల సంఖ్య : 5.17 కోట్లు
బుక్ చేసిన స్లాట్‌లు : 10,45,878
పూర్తయిన లావాదేవీలు : 10,00,973
విక్రయాలు : 5,02,281
గిఫ్ట్ డీడ్‌లు : 1,58,215
వారసత్వం : 72,085
తనఖా : 58,285
పరిష్కరించబడిన ఫిర్యాదులు : 5.17 లక్షలు
పెండింగ్ మ్యుటేషన్లు : 2,07,229
భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 1,73,718
నిషేధించబడిన జాబితా : 51,794
కోర్టు కేసులు, సమాచారం : 24,618

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News