Sunday, November 17, 2024

భూమి రికార్డుల నిర్వహణలో ధరణి ఓ మైలురాయి

- Advertisement -
- Advertisement -

Dharani Portal is milestone in management of Land records

త్వరలో మరింత మెరుగైన మాడ్యూల్స్

నిషేధిత భూములకు సంబంధించి 98,049 దరఖాస్తులకు 82,472 దరఖాస్తులను పరిష్కరించాం
మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో
మంత్రి టి.హరీశ్ రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : భూమి రికార్డుల నిర్వహణలో ధరణి పోర్టల్ మైలురాయిగా నిలుస్తుందని ఒక సంవత్సర కాలంలోనే 10 లక్షల పైబడి లావాదేవీలు ధరణి ద్వారా జరిగినట్లు రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు పేర్కొన్నారు. ధరణిలో నెలకొన్న సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం బిఆర్‌కెఆర్ భవన్‌లో నిర్వహించిన సమావేశానికి మంత్రి టి.హరీశ్ రావు అధ్యక్షత వహించారు. ధరణి పోర్టల్ లో ఎదురవుతున్న వివిధ రకాల సమస్యలను పరిష్కరించడానికి ధరణి మాడ్యూల్స్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులు గురించి ఉపసంఘం సభ్యులు చర్చించారు. నిషేధిత జాబితాలో ఉంచిన భూములపై 98,049 దరఖాస్తులు రాగా, వాటిలో 82,472 దరఖాస్తులను డిస్పోజ్ చేసినట్లు అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షల మేరకు ధరణి పోర్టల్‌ను మరింత పరిపుష్టం చేయడానికి పొందుపర్చాల్సిన ఆఫ్షన్‌లపై చర్చించారు. భూ రికార్డుల నమోదులో జరిగిన పొరపాట్లను సరిచేసేందుకు అనువైన మాడ్యూల్స్‌ను త్వరగా అందుబాటులోకి తీసుకు రావాలని మంత్రి టి.హరీశ్ రావు కోరారు.

అనువైన టెక్నికల్ మాడ్యూల్స్‌ను వెంటనే రూపొందించాలి

ధరణి పోర్టల్ లో ఎదుర్కొన్న పలు సమస్యలను పరిష్కరించడానికి అనువైన మాడ్యూల్స్‌ను, ఆప్షన్స్‌ను పొందుపరిచినట్టు మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షుడు టి.హరీశ్ రావు తెలిపారు. అయితే ఈ మాడ్యూల్స్ పట్ల సరైన అవగాహన లేనందున సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ధరణి పోర్టల్, మాడ్యూల్స్, ఆప్షన్స్‌పై అధికారులు, మీసేవ ఆపరేటర్లకు జిల్లా స్థాయిలో ఒక రోజు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచించారు. అలాగే జిల్లాపరిషత్ , మున్సిపల్ సమావేశాలకు జిల్లా కలెక్టర్లు హాజరై ధరణి గురించి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా జడ్పీటిసి, ఎంపిపిలు, కార్పొరేటర్‌లు, కౌన్సిలర్లు, అధికారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి కలెక్టరెట్‌లోనూ ధరణి హెల్ప్ డెస్క్‌లను నెలకొల్పాలన్నారు.

హెల్ప్‌డెస్క్‌లతో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు దరఖాస్తులను అప్‌లోడ్ చేసేందుకు అనువుగా మీసేవా కేంద్రాల మాదిరిగా పనిచేయడానికి ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సూచించారు. వచ్చే వారంలో మంత్రివర్గ ఉపసంఘం తిరిగి సమావేశం కానుంది. చర్చించిన అంశాలపై అనువైన టెక్నికల్ మాడ్యూల్స్‌ను వెంటనే రూపొందించాలని అధికారులను ఉపసంఘం ఆదేశించింది. ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల సిఐజి వి.శేషాద్రి, టిఎస్ టెక్నాలజికల్ సర్వీసెస్ యండి జి.టి వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News