Sunday, January 19, 2025

ధరణి పోర్టల్ లోపాలు సరిదిద్దాలి: షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వ్యవసాయ రంగంలో రైతులకు మేలు చేకూర్చడమే ప్రభుత్వ లక్షం కావాలని వైస్‌ఆర్‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ధరణి పోర్టల్‌లో ఉన్నలోపాలు గుర్తించి వాటిని సరిదిద్దాలని ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయ్యితే అది వంద శాతం రైతులకు మేలు జరిగే విధంగా ఉండాలని కోరారు. దళారి,పైరవీకారుల వ్యవస్థ బంద్ అయ్యిందని,తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పిందనే అభిప్రాయాలు ప్రభుత్వం నుంచి కంటే రైతుల నుంచి రావాలన్నారు.ధరణి పోర్టల్ లో భూ వివరాల నమోదు తప్పులతడకగా ఉన్నట్టు విమర్శలు వస్తునాయన్నారు. భూములు కొనుగోలు చేసిన వారి పేర్లు కాకుండా పాత పేర్లే కనిపిస్తుండటంతో.. కొన్నవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, దీనిని సవరించేందుకు ప్రభుత్వం ఆప్షన్ ఇవ్వాలన్నారు.. ధరణిలో స్లాట్ బుక్ చేసుకుని, రద్దు చేసుకుంటే ఆ సొమ్ము వెనక్కి రావడం లేదని, ప్రజల సొమ్ముతో తమ ఖజానా నింపుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయన్నారు.

రెండేండ్లు గడిచినా.. ఆ సొమ్ము వెనక్కి రాకపోవడంతో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నట్టు రైతులు చెబుతున్నారని తెలిపారు. ధరణిలో భూసమస్యల పరిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారని , వెంటనే వాటిని నిర్వహించాలని కోరారు. ధరణిలో లోపాలను సవరించేందుకు ఐఏఎస్ అధికారులకు కూడా అవకాశం ఇవ్వాలని, భూ రికార్డుల ప్రక్షాళనలో వేల ఎకరాల పట్టా, వ్యవసాయ భూములను నిషేధిత జాబితాలో ఉండటం సరికాదన్నారు. వ్యవసాయ భూములను ఇండ్ల స్థలాలుగా, పట్టా భూములను అటవీ, ప్రభుత్వ భూములుగా నమోదు చేశారని, దీంతో భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయలేదన్నారు. సర్వే నంబర్‌లో కొంతభాగం నిషేధిత జాబితాకు చెందిన భూమి ఉంటే.. ఆ నంబర్ కు చెందిన మొత్తం భూమిని నిషేధిత జాబితాలో చేర్చారన్నారు.

ధరణికి ముందు ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్ జరిగినా… వాటి మ్యుటేషన్‌ను అడ్డుకునే అధికారం తహసీల్దార్‌కు ఉండేదని , ధరణి వచ్చాక రికార్డులు సరిగ్గా ఉంటే తిరస్కరించడానికి వీల్లేదన్న నిబంధనతో ప్రభుత్వ భూములు, నిషేధిత భూముల మ్యూటేషన్ జరగకుండా అడ్డుకునే అవకాశం పోయిందన్నారు. అన్యాయంగా మ్యూటేషన్ జరిగిందని, జారీ చేసిన పాస్‌పుస్తకం రద్దు చేయాలని ఎవరైనా ఆర్డీవోకు, జాయింట్ కలెక్టర్‌కు గతంలో నివేదించే అవకాశం ఉండగా… ధరణిలో ఆ అవకాశమే లేదన్నారు. అభ్యంతరాలుంటే కోర్టులో సవాల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తద్వారా రైతులు తమ సొంత పనులు వదులుకొని, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా ధరణి లోపాలను సరిచేసి రైతులకు మేలు చేకూర్చాలని షర్మిల ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News