Tuesday, January 21, 2025

పెండింగ్ ముగిసే దాకా ధరణి ప్రత్యేక డ్రైవ్ కొనసాగింపు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి డ్రైవ్ ఇంకా కొనసాగనుంది. భూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఒకటో తేదీ నుంచి చేపట్టిన ధరణి స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్ ప్రకారం శనివారంతో ముగియాలి. అయితే, ఇంకా సమస్యలు అలాగే ఉండటం, వరుస సెలవులు రావడంతో పెండింగ్ దరఖాస్తులన్నీ క్లియర్ చేసేంత వరకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధరణిలో మొత్తం 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా అందులో లక్షా 10 వేల అప్లికేషన్లకు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చారు. మరో లక్షా 35 వేల అప్లికేషన్లు క్లియర్ చేయడానికి అధికారులు వాటిని ముందుకు తీసుకెళుతున్నారు. దీంతోపాటు ధరణి సాఫ్ట్‌వేర్‌లో పలు మార్పులు చేస్తున్నారు. ఎమ్మార్వో, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), కలెక్టర్, సిసిఎల్‌ఏ లాగిన్‌లను మారుస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం కలెక్టర్, సిసిఎల్‌ఏకు మాత్రమే ధరణిలో ఏదైనా భూమిలో మార్పులు చేసేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు లాగిన్లు కింది స్థాయిలోనే ఇవ్వడంతో ఇక మీదట ఎమ్మార్వోలు, ఆర్డీఓలు, కలెక్టర్లు రిపోర్టులు రెడీ చేసి సిసిఎల్‌ఏ వరకు పంపాల్సిన అవసరం లేకుండా క్షేత్రస్థాయిలోనే సమస్యలు పరిష్కరించే వీలును కల్పిస్తున్నారు.
సిసిఎల్‌ఏకు వెళ్లే దరఖాస్తుల్లో టిఎం 33 కింద
తహసీల్దార్ లెవెల్లో లాగిన్ ఇవ్వడం ద్వారా టిఎం4 -విరాసత్ (అసైన్డ్ భూములతో సహా), టిఎం10- జీపిఏ, ఎస్పీఏ, టిఎం14- స్పెషల్ ల్యాండ్ మ్యాటర్స్, టిఎం 32-ఖాతా మెర్జింగ్ వంటివి ఎమ్మార్వో స్థాయిలోనే అయిపోనున్నాయి. వీటిని ఏడు రోజుల్లోగా పరిష్కరించనున్నారు. ఆర్డీఓ లెవెల్ లో టిఎం 7-పాసు పుస్తకం లేకుండా నాలా కన్వర్షన్, టిఎం 16-ప్రభుత్వం సేకరించిన భూముల్లో సమస్యలు, టిఎం 20-ఎన్‌ఆర్‌ఐలకు సంబంధించిన సమస్యలు, టిఎం 22-సంస్థలకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాల సమస్యలు, టిఎం 26- కోర్టు కేసులు, సమాచారం, టిఎం 33- డేటా కరెక్షన్స్, మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణం, సర్వే నంబర్ మిస్సింగ్స్ (ఎకరం రూ.5 లక్షల లోపు ఉన్న ఏరియాల్లో మాత్రమే) లాంటివి పరిష్కారం కానున్నాయి. కాగా, ఆర్డీఓ తనకు అప్పగించిన మాడ్యూళ్ల దరఖాస్తులను మూడు రోజుల్లోగా పరిష్కరిస్తారు. ఇక సిసిఎల్‌ఏకు వెళ్లే దరఖాస్తుల్లో టిఎం 33 కింద డేటా కరెక్షన్, నోషనల్ ఖాతా ట్రాన్స్‌ఫర్, క్లాసిఫికేషన్ మార్పు, రూ.50 లక్షలకు పైగా విలువజేసే భూముల్లో డేటా కరెక్షన్ వంటివి ఉండనున్నాయి.
అధికంగా రంగారెడ్డి జిల్లాలోనే….
ప్రభుత్వం ఆదేశించిన ప్రత్యేక డ్రైవ్ శుక్రవారం ముగియగా ఇంకా లక్షకు పైచిలుకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా అందులో శుక్రవారం నాటికి 91,000లకు పైగా దరఖాస్తులను పరిష్కరించినట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ధరణి స్థానంలో భూమాత పేరిట కొత్త పోర్టల్‌ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2,46,536 అపరిష్కృత దరఖాస్తులు ఉండగా అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 39,000లు, నల్గొండ 23,000లు, సంగారెడ్డి 19,000లు, వికారాబాద్ 14,000లు, నాగర్‌కర్నూల్ 11,000లు, ఖమ్మం 10,000లు ఉన్నాయి. వీటిలో కొన్ని క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి కాగా, ఇవి ఆర్డీఓలు, కలెక్టర్లు, సిసిఎల్‌ఏ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా వేగంగా పరిష్కారం చూపేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం నాటికి 91,000లకు పైగా అర్జీలను పరిష్కరించినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పరిష్కారం అయిన వాటిలో రెండేసి ఖాతాలు ఉండగా వాటిని కలపడం, భూసేకరణ, కోర్టు కేసులు, పెండింగ్ మ్యుటేషన్లకు సంబంధించిన భూముల సమస్యలను ఎక్కువగా పరిష్కరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News