మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎమ్మెల్యే సీతక్కను ముఖ్యమంత్రి చేస్తామంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపి ధర్మపురి అర్వింద్ స్పందించారు. ముఖ్యమంత్రి కాదు.. మొదట సీతక్కను పిసిసి అధ్యక్షురాలిగా చేయగలరా అని ప్రశ్నించారు. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే కాదు.. సీతక్కను సిఎం చేస్తామని నమ్మకంగా ఎందుకుగా చెప్పలేదని నిలదీశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోన్న యూసిసి బిల్లుపై అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును పార్లమెంట్ లో వ్యతిరేకిస్తామని బిఆర్‌ఎస్ చెబుతోందని.. అయితే, బిఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఇవ్వకపోయిన యూసిసి బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉభయ సభల్లో యూసిసి బిల్లు పాస్ అయ్యాక సిఎం పాకిస్థాన్ పోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. ముస్లిం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కు పడతాయన్న భయంతోనే ముస్లిం మతపెద్దలతో బిఆర్‌ఎస్ నేతలు భేటీ అయ్యారని ఆరోపించారు.