మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి నుండి లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ ఏసీబీకి పట్టుబడిన సంఘటన గురువారం సాయంత్రం ధర్మపురిలో చోటు చేసుకుంది. బాధితుడు పైడిపెల్లి మహేష్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి…జగిత్యాల జిల్లా ధర్మపురి పురపాలక సంఘంలో గత నాలుగు ఏళ్లుగా పైడిపెల్లి మహేష్ ఏన్విరాన్‌మెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గత ఆరు నెలలుగా వేతనం రాకపోవడం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తనకు రావాల్సిన ఆరు నెలల జీతం ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ కందుకూరి శ్రీనివాస్‌ను చాలా సార్లు అడిగాడు. జీతం ఇవ్వకుండా మహేష్‌ను కమిషనర్ శ్రీనివాస్ తీవ్ర ఇబ్బందులకు
గురి చేస్తూ సంబందంలేని విధులు చెప్తూ, అందరి ముందు హేళన చేస్తున్నాడు. మహేష్ సర్వీస్ పొడిగింపు కోసం సైతం రూ. 10 వేలు అడుగగా చెల్లించాడు. జీతం డబ్బుల కోసం మరో రూ. 20 వేలు ఇవ్వాలని శ్రీనివాస్ డిమాండ్ చేయడంతో, బాధితుడు బుధవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు గురువారం సాయంత్రం ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో మహేష్ కమిషనర్ శ్రీనివాస్‌కు రూ. 20 వేలు ఇస్తుండగా కరీంనగర్ కమిషనరేట్ ఏసీబీ డిస్పీ రమణమూర్తి, ఇన్‌స్పెక్టర్‌లు కృష్ణ కుమార్, తిరుపతిలు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.