Monday, December 23, 2024

ధర్మో రక్షతి రక్షితః

- Advertisement -
- Advertisement -

ధరతి ఇతిధర్మః’ విశ్వాన్ని ధరించి వున్న ఒక విశిష్ఠ శక్తి ధర్మం! దేహాన్ని ధరించి, దేహావయవాలు విడిపోకుండా కాపాడుతున్న చర్మం లాగే; ఈ సమాజాన్ని, ప్రపంచాన్ని, విశ్వాన్నీ విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంటుంది ధర్మం! అందుకే చర్మాన్ని కాపాడుకుంటున్నంత శ్రద్ధాభక్తులతో ధర్మాన్ని కాపాడుకుంటుందాలి కాని, ధర్మహానికి పూనుకోరాదు! “ధర్మ ఏవహతో హంతి! ధర్మో రక్షత రక్షితః!” ధర్మానికి హాని చేసిన వారిని హతమార్చుతూ, ధర్మాన్ని కాపాడుకునే వారిని రక్షిస్తుంటుంది ధర్మం!ఉదా॥ కౌరవ సభలో ద్రౌపదిని వివస్త్రను చేస్తూ ధర్మహానికి పూనుకొన్న దుర్యోధనాదులతో పాటు, వారిని ఖండించకుండా మిన్నకుండిన, భీష్మ ద్రోణ కర్ణాదులనూ హతమార్చింది ధర్మం! అలాగే మణిపూర్‌లోనూ మహిళలను వివస్త్రలను చేసిన దుష్టులతో పాటు, చూస్తూ ఊరుకొన్న అధికారులను, పాలకులనూ వదలదు ధర్మమంటున్నారు విజ్ఞులు! ఎందుకంటే ధర్మం శాశ్వత (సనాతన) ధర్మమదే! ఉదా॥ సూర్యుని స్వయం ప్రకాశం; గ్రహాల స్వయం పరిభ్రమణం; అలాగే నీటి నుండి ప్రవహించడం; అగ్ని నుండి దహించడం; వాయువు వ్యాపించడం కూడా విడదీయలేని శాశ్వత ధర్మాలే!
ఇంకా, ప్రకృతి (ఇచ్చిపుచ్చుకునే ధర్మం కూడా శాశ్వత ధర్మమే! ఉదా॥ ప్రాణులు ప్రాణ వాయువును (ఆక్సిజన్) తీసుకుంటూ, కర్బన్ వాయువు నిస్తుంటాయి.

చెట్లు కర్బన వాయువును తీసుకుంటూ ఆక్సిజన్ ఇస్తుంటాయి. సముద్రం మబ్బులకు నీటి ఆవిరినిస్తూ నదుల నీటిని తీసుకుంటుంది. నీటి ఆవిరిని తీసుకని నీటిని వర్షిస్తుంటాయి మేఘాలు! అలాగే మన వున్నతికి తోడ్పడుతున్న మన సమాజ, దేశ ప్రగతి కోసం ఏ రంగంలో, ఏ స్థాయికెదిగిన వారైనా విధిగా పరిశ్రమించాలి! ‘ఇచ్చిపుచ్చుకునే ఈ సనాతన ధర్మాన్ని పాటించకుంటే అన్నం, నీళ్ళూ తీసుకొని, మల, మూత్రాలను వదలని మన దేహం లాగే ఈ సృష్టి అంతా జబ్బున పడి నశిస్తుంది!” అన్నారు శ్రీరామకృష్ణ పరమ హంస!

వేదోక్త సనాతన ధర్మమిదే! “ఏకం సత్, విప్రా బహుధా వదన్తి” అంటున్నది రుగ్వేదం! “రుషి భిర్బహుధా గీతం, ఛందోర్భిర్వివిధైః పృథక్‌” అంటున్నది భగవద్గీత. ‘ఉన్న’ దొక్కటే సత్యం (దైవం)! దానినే రుషులు (పండితులు ప్రవక్తలు) పలు విధాలుగా (ఈశ్వర్ బుద్ధ జైన అల్లాహ్ యెహెవా) వగైరాలుగా పిలుచుకున్నారని భావం! “ఏ దిశగా ప్రవహించినా ఆ నదులన్నీ సముద్రాన్ని చేరినట్లే, ఎవరే మార్గాన పూజించినా వారి పూజలన్నీ చెందేది సర్వేశ్వరునకే” నని గీతా ప్రబోధాన్ని వివరించారు స్వామీ వివేకానంద! “జ్ఞానాన్ని మించిన సంపద, శక్తి, ఔన్నత్యాలు లేవంటున్నది గీత!”. “కులం కన్నా జ్ఞానం మిన్న! జ్ఞానిని ఉన్నత కులస్థునిగా, అజ్ఞానిని అధమ కులస్థునిగా పరిగణించాలంటున్నది ‘వజ్ర సూచికోపనిషత్!
ఉదా॥ బోయ జాతి వాల్మీకిని బెస్త జాతి, వ్యాసుని మాదిగ మాతంగుని నక్కలు పట్టే జాతి జంబూకుని మొ॥ శ్రామిక జాతి వారిని క్షత్రియ విశ్వామిత్రుని మహర్షులుగా ఆరాధించింది నాటి సమాజం! మాదిగ మహిళ ‘మాతంగ కన్య’ కాళిదాసు మొ॥ ప్రముఖుల చేత ‘శక్తి స్వరూపిణి’గా పూజింపబడింది!” అలాగే, “అధమ జ్ఞానం, వికృత చేష్టల కారణంగా బ్రహ్మ వంశజులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిప, రావణాదులను, క్షత్రియ నరకుని, రాక్షసులుగా ద్వేషించింది నాటి హైందవ సమాజం!” అదీ సిసలైన హైందవ సనాతన ధర్మం.

ఆ ప్రకారం, ప్రపంచాగ్రగణ్య మేధావులలో ఒకరు, అత్యుత్తమ భారత రాజ్యాంగ కర్త, భారత రత్న అంబేడ్కర్‌ను బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ‘మహర్షి’గా అంగీకరించ గలరా? ఆర్‌ఎస్‌ఎస్ సూచన మేరకు ‘మను ధర్మ శాస్త్రాన్ని’ సనాతన ధర్మంగా పరిగణిస్తే, ప్రధాని మోడీతో సహా ఎస్‌సి, ఎస్‌టి, బిసి మొ॥ శూద్రులు పాలనార్హతను కోల్పోతారు మరి! ఇదంతా విమర్శించడం కాదు మోడీజీ, సనాతన ధర్మాన్ని పాటించని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు, సనాతన ధర్మాన్ని విడనాడుతున్న ఉదయనిధి స్టాలిన్‌కు తేడా ఏంటని ప్రశ్నించడానికే! ఆచారాలు, సాంప్రదాయాలు, పాలనా వ్యవస్థలు తాత్కాలికాలు! అవి కాలానుగుణంగా పాతవి పోతుంటయ్, కొత్తవి వస్తుంటాయ్! ఉదా॥ బాల్య వివాహాలు, సతీ సహగమనాలు, వితంతువులను జీవితాంతం అలాగే వుంచడం మొ॥ సాంప్రదాయాలను మనమే రూపొందించుకున్నాం! తిరిగి మనమే వదిలేశాం.

అలాగే మనమే రూపొందించుకున్న వ్యవస్థను మనమే విచ్ఛిన్నం చేసుకొని మరో కొత్త వ్యవస్థను రూపొందించుకుంటూ వస్తున్నాం. గుంపు సమాజం, గణతంత్ర వ్యవస్థ, రాజరిక, చాతుర్వర్ణ, భూస్వామ్య, బానిస, పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద, సామ్యవాద, ప్రజాస్వామ్య వ్యవస్థల దిశగా పయనిస్తున్నాం. ఇదీ ప్రకృతి ధర్మమే! ఉదా॥ పాము దేహం పెరిగినంతగా దాని చర్మం పెరగలేదు. అందుకని నెలకోసారి పాము తన చర్మాన్ని తానే చింపేసుకొని తిరిగి కొత్త చర్మాన్ని ధరిస్తుంటుంది! అలాగే మనం రూపొందించుకొన్న సాంప్రదాయ వ్యవస్థలు ఇబ్బందికరంగా మారినప్పుడు, వాటిని తిరిగి మనమే విడనాడి ముందుకెళ్తుంటాం! జీవుల పరిణామమూ సదా మునుముందుకు, మరింత వున్నత దిశగానే సాగుతుంటుంది! ఉదా॥ ఏక కణజీవి (అమీబా), బహు కణ జీవులు, జలచర, భూచర, ఉభయ చర, వానర, ఆదిమ మానవ, నవీన మానవ, మానవోత్తమ దిశగా పయనిస్తున్నాం.

కావున మనం సదా ఉన్నతంగా ఆలోచిద్దాం! మును ముందుకే పయనిద్దాం! కాలం చెల్లిన కుల వివక్ష వగైరా సాంప్రదాయాలను నిర్మూలిద్దామనడం సబబే! కాని ధర్మాన్ని నశింపజేద్దామనడం పూర్తిగా పొరపాటు! ఎందుకంటే ధర్మాన్ని నశింప జేయుట మంటే, మనల్ని మనం నశింప జేసుకున్నట్లే! ఉదయనిధే కాదు, సామాజిక శ్రేయోభిలాషులంతా సదా గుర్తుంచుకోవలసిన వాస్తవమిది! అయితే దేశానికి తండ్రి వంటి ప్రధాని స్థానంలో వున్న నరేంద్రలచ వారు, ప్రజలకు సనాతన ధర్మమంటే ఏంటో, దాని ఆవశ్యకత ఏంటో వివరించి, తప్పుగా మాట్లాడి వుంటే ఉదయనిధి వంటి వాళ్ళను పొరపాటును సరిజేసుకోమని సూచిస్తే గౌరవ ప్రదంగా వుండేది! కాని “సనాతన ధర్మాయుధం”తో అలాంటి వారిపై దాడికి ప్రోత్సహించడాన్ని ఎన్నికల ఎత్తుగడగా భావిస్తున్నారు ప్రజలు! ‘పుల్వామా సర్జికల్ స్ట్రయిక్ , పాకిస్థాన్, చైనా వ్యతిరేక నినాదాలు, హిందూత్వ, సనాతన ధర్మం’ ఇవన్నీ ‘చిందుకు ముందు దరువు’ లాంటివని నవ్వుకుంటున్నారు! ఉదా॥ డమ, డమా, టప టపా తప్పెట పై దరువేస్తే చాలు, స్త్రీ, బాల వృద్ధులతో సహా చిందేస్తుంటారు’ అలాగే ఎన్నికలకు ముందుగా భావోద్వేగాలను జ్వలింప చేసే “దేశభక్తి హిందూత్వ, సనాతన ధర్మం” వంటి దరువును ప్రారంభిస్తున్నారు

పాలకులు! “రానున్న ఎన్నికల దరువుకు అలవాటు పడిన పాలకులు కాదు, రాబోయే తరాల భవితకు, భావి భారత ప్రగతికి సుదృఢ పునాది వేసే రాజనీతిజ్ఞులు కావాలి మనకు” కావున ఉపాధ్యాయ, ఉద్యోగ, మేధావీ, కవి, పాత్రికేయ, కళాకారులారా! దయ చేసి ఆదిశగా ప్రజలను చైతన్య వంతం చేసుకుందాం! ‘భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నది!’ అలాగే మన కుటుంబ కర్తవ్యంతో పాటు, ఈ సామాజిక కర్తవ్యాన్ని నెరవేర్చుకుందాం గాక!

పాతూరి వేంకటేశ్వరరావు
9849081889

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News