శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని కిష్తార్ జిల్లా లో గురువారం భారత సైన్యానికి చెందిన ఎఎల్‌హెచ్ ధ్రువ్ అనే తేలికపాటి హెలికాప్టర్ కుప్ప కూలింది. సమాచారం తెలుసుకున్న ఆర్మీ సహస్రబల్, పోలీస్‌లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మార్వా అటవీ ప్రాంతంలోని ఓ నదిలో హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. పైలట్, కోపైలట్ గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ముగ్గురున్నట్టు అంతకు ముందు అధికారులు ప్రకటించినా మూడో వ్యక్తి గురించి స్పష్టత రాలేదు.
ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మార్చి 8న అరుణాచల్ ప్రదేశ్ లోని మండాల హిల్స్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీకి చెందిన చీతాహెలికాప్టర్ కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ధ్రువ్ హెలికాప్టర్లు ప్రమాదాలకు గురికావడం గత రెండు నెలల్లో ఇది రెండసారి. మార్చి ఘటన తరువాత ధ్రువ్ హెలికాప్టర్ల వినియోగాన్ని నిలిపివేసినప్పటికీ, గత సోమవారం నుంచే వీటిని మళ్లీ వినియోగించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరగడం గమనార్హం.