కల్వకుర్తి మండలంలో డైమండ్ల ఉనికి
లోతైన పొరల్లో వజ్రాలతో కూడిన మిశ్రమధాతువులు
ఉస్మానియా యూనివర్శిటీ భూగర్భ శాస్త్ర విభాగం సర్వే
హైదరాబాద్: గోల్కొండ వజ్రాలు అంటూ గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా ఇప్పటివరకు ఈ ప్రాంతంలో డైమండ్లను కనుగొన్న చరిత్ర లేదు. కానీ, ఇటీవలి పరిశోధనలు తాజాగా ఆశలు రేకెత్తిస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో మూసీ, కృష్ణా నదుల సంగమ ప్రాంతంలో వజ్రాల ఉనికిని గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనూ వజ్రాలను కలిగి ఉండే మిశ్రమ ధాతువులైన కింబర్‌లైట్లు, ల్యాంప్రోఐట్లను గుర్తించారు. వీటిని మహబూబ్‌నగర్ జిల్లాలో భీమాకృష్ణా నదుల సంగమం, గద్వాల జిల్లాలో తుంగభద్ర కృష్ణా నదుల సంగమ ప్రాంతంలో గుర్తించారు. కృష్ణా నది ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన డైమండ్లు దొరికిన చరిత్ర ఉంది. వాటిలో కోహినూర్ డైమండ్ కూడా ఒకటి. ల్యాంప్రోఐట్లనేవి అగ్ని పర్వతాల లావా వల్ల తయారువుతాయి. గోల్కొండ ప్రాంతంలో ఇప్పటివరకు డైమండ్ల తవ్వకాలు జరగకపోయినా, దక్షిణ భారత డైమండ్ ప్రాంతం(ఎస్‌ఐడిపి)లో లభ్యమైన డైమండ్లను గోల్కొండ డైమండ్స్‌గా వ్యవహరిస్తున్నారు.
తాజా పరిశోధనలు వాస్తవరూపం దాల్చితే గోల్కొండ వజ్రాలు అనేది సార్థక నామంగా మారనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ(ఒయు)లోని భూగర్భశాస్త్ర విభాగానికి చెందిన పరిశోధకులతోపాటు మరికొందరు పరిశోధకులు రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సర్వేలు నిర్వహించారని ఒయు జియోఫిజిక్స్ మాజీహెడ్, ప్రొఫెసర్ రామదాస్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో డైమండ్ల ఉనికి లేదని, నల్లగొండలో మూసీకృష్ణా నదులు కలిసే ప్రాంతంలో గుర్తించామని ఆయన తెలిపారు. నల్లగొండ జిల్లా వాడపల్లి(మూసీకృష్ణా నదులు సంగమించే ప్రాంతం)పై తాము దృష్టి సారించామని ఆయన తెలిపారు. తుంగభద్ర, భీమా, మూసీలు కృష్ణా నదితో కలిసే ప్రాంతాలను డైమండ్ల పాకెట్లుగా ఆయన అభివర్ణించారు. లోతైన పొరల్లో వాటి ఉనికిని గుర్తించామని ఆయన తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లోని ఎస్‌ఐడిపి ప్రాంతంలో డైమండ్లు లభించే క్షేత్రాలను దక్కన్ కింబర్‌లైట్‌ఫీల్డ్, వజ్రకరూర్ కింబర్‌లైట్ ఫీల్డ్,నారాయణపేట కింబర్‌లైట్‌ఫీల్డ్‌గా పిలుస్తారు. ఇవి మహబూబ్‌నగర్ నుంచి కర్నాటకలోని గుల్బర్గా వరకు విస్తరించి ఉన్నాయి. రాయచూర్ కింబర్‌లైట్ ఫీల్డ్ మహబూబ్‌నగర్ నుంచి రాయ్‌చూర్ వరకు విస్తరించి ఉన్నాయి. వాగులు, వంకల వల్ల గుల్లబారిన నేలలో డైమండ్లకు అవకాశముంటుందని రామదాస్ తెలిపారు. ఇటీవల రామదాస్ సమర్పించిన పరిశోధనా పత్రంలో కల్వకుర్తి మండలంలో డైమండ్ల ఉనికిని గుర్తించినట్టు తెలిపారు. గతంలో ఇతర పరిశోధకులు సమర్పించిన పత్రాల్లో మిర్యాలగూడ ప్రాంతంలోని రామన్నపేటఉస్తాపల్లిలో ల్యాం ప్రోఐట్లను గుర్తించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌లో ఓ రైతు తనకు డైమండ్ దొరికిందని చెప్పగా, ఆ ప్రాంతంలో తాము పరిశోధన జరపగా అక్కడ డైమండ్ జోన్ ఏమీ లేదని తేలిందని రామదాస్ తెలిపారు.