ఐదేళ్ల లోపు పసిపిల్లలు చాలా మంది డయేరియా, పౌష్టికాహార లోపం వంటి సమస్యలతో అనారోగ్యం పాలవుతున్నారు. ఈమేరకు 13 శాతం మంది ఈ సమస్యల పాలు కావడమే కాక, మరణాలు కూడా సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలను నివారించాలంటే తల్లిపాలు ఒక్కటే శ్రేయస్కరమని, స్తన్యపోషణ వల్లనే శిశుమరణాల రేటు చాలా వరకు తగ్గుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. స్తన్యపోషణకు డయేరియాకు గల సంబంధంపై ఉస్మానియా మెడికల్ కాలేజీ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం గతంలో పరిశోధనలు సాగించింది.
పసికందుల్లో సాధారణంగా అనారోగ్య సమస్యలకే కాకుండా , పౌష్టికాహార లోపానికి , శిశుమరణాలకు కూడా డయేరియాయే ప్రధాన కారణం అవుతోందని ఈ విభాగానికి చెందిన వైద్య నిపుణులు వెల్లడించారు. పసితనంలో ఇటువంటి అనారోగ్య సమస్యల నుంచి రక్షించేది స్తన్యపోషణే. ఇది డయేరియాను, దానివల్ల వచ్చే ఫలితాలను నివారిస్తుంది. అయిదేళ్ల లోపు పసిపిల్లలు మరణించడానికి ప్రధాన కారణాల్లో డయేరియా ఒకటి. 18 శాతం మంది డయేరియా వ్యాధుల పీడితులవుతున్నారు. భారత దేశంలో ఏటా మూడు లక్షలకు మించి పసిపిల్లలు డయేరియా వ్యాధులతో మృత్యువాత పడుతున్నారు.
కొన్ని నెలల పాటు సాగిన ఈ అధ్యయనంలో పరీక్షించిన శిశువుల్లో 25 శాతం మంది డయేరియాతో బాధపడుతున్నట్టు బయటపడింది. ఇంతేకాక 68 శాతం మందికి తమ పాలపోషణ వల్లనే బిడ్డలకు డయేరియా నివారణ అవుతుందని అవగాహన లేకపోవడం గమనార్హం. డయేరియాకు స్తన్యపోషణ అందించే కాలానికి సంబంధం లేదన్న దృష్టితో వారు ఉంటున్నారు. స్తన్యపోషణ బిడ్డలకు మొదటి నుంచి అందినట్టయితే డయేరియా అసలు రానేరాదు.
అందువల్ల డయేరియా నుంచి పసిబిడ్డలను రక్షించుకోవడంలో కీలక పాత్ర వహించే స్తన్యపోషణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వ్యై నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బిడ్డ పుట్టిన వెయ్యి రోజుల్లో పోషణ లోపిస్తే విపరీతమైన పరిణామాలు ఏర్పడతాయి. ఎదుగుదల సరిగ్గా ఉండదు. బుద్ధి మాంధ్యత ఏర్పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.