ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో పోలీసుల దాష్టీకం వెలుగులోకి వచ్చింది. ఇందల్వాయి మండల కేంద్రంలో తన పాన్ షాప్ ముందు నడిరోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు మద్యం తాగుతున్నారని 100కు కుమ్మరి సాయిలు అనే వ్యక్తి కాల్ చేసి ఫిర్యాదు చేశారు. కానీ సాయిలు స్థానికులతో కలిసి ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదు ఎందుకు తీసుకోవట్లేదని అడిగినందుకు తమని పోలీసులు అతి దారుణంగా కొట్టారని కుమ్మరి సాయిలు ఆరోపణలు చేశారు.
కాపాడాల్సిన పోలీసులే క్రూరంగా ప్రవర్తిస్తే సామాన్య ప్రజలు ఎలా బ్రతకాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కారణం లేకుండా తమని కొట్టిన పోలీసులపై కట్టిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మందుబాబుల ఆగడాలకు హద్దులు లేకుండా పోతున్నాయని స్థానికులు ఆరోపణలు చేస్తున్నప్పటికి పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పోలీస్ ఉన్నతాధికారులు కూడా స్పందించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.