Friday, December 27, 2024

ఆ భూమిని కొన్నారా?

- Advertisement -
- Advertisement -

మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్ తన భార్య పేరు మీద కొనుగోలు చేసిన భూమిపై వివాదం
ఎక్కడా కనపడని సేల్‌డీడ్, ఈసీలు!
అయినా ధరణిలో ప్రత్యేక ఖాతా నెంబర్ ప్రత్యక్షం
సోమేష్‌పై డిఓపిటికి ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం

మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్ తన భార్య పేరిట కొనుగోలు చేసిన ఆస్తిపై వివాదం నెలకొంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 249, 260లో మొత్తం 25.19 ఎకరాల భూమిని డా.గ్యన్ముద్ర పేరిట ఆస్తులు ఉన్నట్లు విషయం బయటకు రావడంతో ఈ విషయమై డిఓపిటికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. అయితే ధరణిలో ఆమె పేరు ఉన్న రికార్డులను కాంగ్రెస్ నాయకులు బయటపెట్టడంతో ప్రస్తుతం ఆ విషయం సంచలనంగా మారింది. ఆయన రాష్ట్రంలో ఉన్నత ఉద్యోగం చేస్తుండగా ఆయన కొన్న భూములకు సంబంధించి డిఓపిటికి సమాచారం ఇవ్వలేదని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, వాటిని ఢిల్లీలోని డిఓపిటికి అందిస్తామని వారు పేర్కొంటున్నారు. అయితే ఆయన సిఎస్‌గా, రెరా చైర్మన్‌గా పనిచేసిన సమయంలోనూ వేరే ఐఏఎస్‌లతో కలిపి రంగారెడ్డి జిల్లాలోని పలుచోట్ల భూములను కొనుగోలు చేశారని వాటి వివరాలను కూడా తాము డిఓపిటికి సమాచారం అందిస్తామని కాంగ్రెస్ నాయకులు ఆరోపించడం విశేషం.
ఖాతా నంబరు 5237 ఎలా వచ్చింది?
ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేస్తోన్న కాలంలో ఆ భూములను కొనుగోలు చేశారా? అంతకు ముందే ఆయన కొన్నారా? అన్న విషయం స్పష్టంగా తెలియరాలేదు. సోమేష్ కుమార్ తన ఆస్తులను ధరణి పోర్టల్ అమలుకు ముందే కొనుగోలు చేశారా? ఆ తర్వాత కొన్నారా? ఆ తర్వాత కొంటే ఖాతా నంబరు 5237 ఎలా వచ్చింది? అసలు సేల్ డీడ్ ద్వారానే కొన్నారా? సాదాబైనామా ద్వారా కొన్నారా? వంటి అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ధరణి భూ సమస్యల వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం విశేషం.
యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో…
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో పట్టాదారు గ్యన్ముద్ర(ఫాదర్ లేదా భర్త పేరు సోమేష్ కుమార్) పేరిట ఖాతా నం.5237 ద్వారా సర్వే నం.249/ఆ1 లో 8 ఎకరాలు, 249/ఆ2 లో 10 ఎకరాలు, 260/అ/1/1 లో 7.19 ఎకరాల వంతున మొత్తం 25.19 ఎకరాలు ఉన్నట్లు తేలింది.
ప్రత్యేక ఖాతా నంబర్ ఎందుకు?
అయితే సర్వే నం.249 లో ధరణి పోర్టల్ రాకముందు ఈసీని పరిశీలిస్తే కేవలం ఐదు లావాదేవీలు మాత్రమే జరిగాయి. అందులో సోమేష్ కుమార్ కుటుంబ సభ్యుల పేర్లు రాలేదు. – సర్వే నం.260 కి సంబంధించిన లావాదేవీలను పరిశీలిస్తే నాలుగే ఉన్నాయి. అందులోనూ సోమేష్ కుమార్‌కు సంబంధించిన లావాదేవీలు కనిపించడం లేదు. -ధరణి పోర్టల్ లో ఈ భూమికి సంబంధించిన ఖాతా నం. 5237గా ఉంది. నిజానికి భూ రికార్డుల ప్రక్షాళనకు ముందు ఆ స్థాయిలో భూ ఖాతాదారులు లేరు. మూడు వేలకు మించి లేరు. మరి ఈ ఖాతా నంబరు ఏ విధంగా కేటాయించారన్నది ప్రశ్న. ధరణి అమలైన తర్వాత కొనుగోలు చేసి ఉంటే 60 వేలకు పైగా ఉంటుంది. ఇదే సర్వే నంబరులోని ఇతర పట్టాదారులకు 60 వేలకు పైగా ఖాతా నంబర్ ఉంది. ప్రత్యేకంగా ఖాతా నంబరును సృష్టించడం వెనుక ఆంతర్యమేమిటన్న విషయమై అధికారులు మరింత లోతుగా పరిశీలించాలని ధరణి భూ సమస్యల వేదిక డిమాండ్ చేస్తోంది.
ఈసీలోనూ ఆధారాలు లేవు..?
ఈ భూమి సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేయలేదని, సాదాబైనామా ద్వారా కొనుగోలు చేయాల్సిన అవసరం సోమేష్‌కుమార్‌కు ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ లోనూ ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్‌ను పరిశీలిస్తే కొనుగోలు చేసిన ఆధారాలు కనిపించడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News