వేలిపై రోజులు తరబడి చెరిగిపోని సిరా చుక్క
మన తెలంగాణ / హైదరాబాద్ : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్య ప్రజానీకం మొదలు సెలబ్రిటీలు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొందరు తాము ఓటు వేసిన అనంతరం తాము ఓటు చేశామని చెబుతూ తమ ఎడమ చేతిచూపుడు వేలును చూపుతుంటారు. కొంత మంది తాము వేసిన ఓటు చిహ్నం( చూపుడు వేలిపై ఉన్న సిరా చుక్క)తో సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ఇంత చేస్తున్నా వారికి ఓటు వేసే సమయం అధికారులు తమ వేలిపై వేసే సిరా చుక్కను అంతంగా పట్టించుకోరు. అయితే అధికారులు వేలిపై వేసే సిరా చుక్కకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఓటు వేసిన వ్యక్తి మళ్లీ ఓటు వేయకుండా ఇలా సిరా గుర్తు పెట్టే పద్ధతి 1962 సార్వత్రిక ఎన్నికల్లో మొదలైంది. దొంగఓట్లు వేయకుండా కట్టడి చేసేందుకు సిరా గుర్తు పద్ధతి మంచి ఫలితాలే ఇస్తోంది. సిరా చుక్క. మనం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం కూడా అదే.
ఎన్నికల్లో ఉపయోగించే సిరాను చెరగని సిరా (ఇండెలిబుల్ ఇంక్) అంటారు. మొదట్లో సిరాను చిన్న బాటిల్స్‌లో నింపి సరఫరా చేసేవారు, 2004 తర్వాత ఇంక్ మార్కర్లను తీసుకొచ్చారు. మనదేశంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు ఎన్నికల వేళ ఓటేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి.భారత ఎన్నికల సంఘంలోని నిబంధన 37(1) ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలుపై సిరా గుర్తును పరిశీలించాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిపై ఉంటుంది. ఒక వేళ ఓటరుకు ఎడమచేయి చూపుడు వేలు లేనట్లయితే వేరే ఏ వేలుకైనా సిరా చుక్క పెట్టాలి.
ఎన్నికల వేళ కీలకంగా మారిన సిరాను దేశంలో ప్రధానంగా రెండు సంస్థలు మాత్రమే తయారు చేస్తున్నాయి. కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (ఎంపివిఎల్) ఒకటైతే, హైదరాబాద్ లోని రాయుడు లేబటరీస్ మరోకటి భారత ఎన్నికల సంఘం మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ సిరాను ఎక్కువగా వినియోగిస్తుండగా, ప్రపంచంలోని దాదాపు వందదేశాలకు దేశాలకు రాయుడు లేబొరేటరీస్ తయారు చేస్తోన్న సిరా సరఫరా అవుతోంది. ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉండటం వల్ల ఇంకు గుర్తు 3-4 రోజుల వరకు చెరిగిపోదు.ఈ ఇంకును స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పిల్లలకు పోలియో చుక్కలు వేసే సమయంలోనూ వీటిని ఉపయోగిస్తుండటం గమనార్హం.