కూచ్‌బెహర్ ఎన్నికల సభలో మోడీ వ్యాఖ్య
కూచ్‌బెహర్ (పశ్చిమబెంగాల్ ): పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గుత్తగోలుగా ముస్లిం ఓట్లను టిఎంసికి కోరుతున్నారంటే ముస్లిం ఓటుబ్యాంకును ఆమె కోల్పోతున్నట్టు స్పష్టమౌతోందని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. మంగళవారం కూచ్‌బెహర్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. ముస్లిం ఓటర్లు ఐక్యంగా ఉండాలని, ముస్లిం ఓట్లలో చీలిక తేవద్దని మమతాబెనర్జీ ఇటీవల అభ్యర్థించడాన్ని ఆయన ఉదహరించారు.
అదేవిధంగా తమ పార్టీ హిందువులంతా సమైక్యంగా ఉండి తమకే ఓటు వేయాలని అభ్యర్థించి ఉంటే ప్రతివారు తమను విమర్శించేవారని, ఎన్నికల సంఘం నుంచి కూడా నోటీసులు వచ్చేవని మోడీ వ్యాఖ్యానించారు. విజయాన్ని ముందుగానే భావించి చెబుతున్న బిజెపి నేతలు దేవుళ్లా?అతీత శక్తులు కలిగిన వారా ? అని మమత వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావిస్తూ బిజెపి విజయాన్ని అంచనా వేయడానికి ఎవరూ అతీతశక్తులు కలిగిన వారు కానక్కర లేదని బిజెపికి అనుకూలంగా వీస్తున్న ప్రభంజనమే ఇది చెబుతుందని మోడీ విమర్శించారు. దీదీ నిష్క్రమణ ఖాయమని రెండు దశల పోలింగ్ తరువాత స్పష్టమైందని పేర్కొన్నారు. తమ ఎన్నికల ప్రచార ర్యాలీలకు జనం డబ్బు కోసం వస్తున్నారని మమత ఆరోపించడం బెంగాల్ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టు అయిందని విమర్శించారు.