కోల్‌కతా: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర బలగాలపై చేస్తున్న ఆరోపణలు సరికావని ప్రధాని నరేంద్ర మోడీ హితువు పలికారు. ఒక వర్గాన్ని కించపరుస్తూ ప్రజలను రెచ్చగొట్టడంతో హింస చెలరేగిందన్నారు. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బర్థమాన్ నియోజకవర్గంలో పిఎం మోడీ పర్యటించారు. ఓటమి భయంతోనే దీదీలో అసహనం, కోపం పెరిగిందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి నినాదమై ‘మా, మాతి, మనుష్’ను దీదీ మరచిపోయి మోడీ, మోడీ, మోడీ అని జపం చేస్తున్నారని చురకలంటించారు. మాను అంటే హింసించడం, మాటి అంటే మాతృభూమిని దోచుకోవడం, మనుష్ అంటే మనుషుల మధ్య రక్తపాతం సృష్టించడమే ఆమెకు తెలుసునని మండిపడ్డారు. మమతా బెనర్జీ తన పాలనలో పశ్చిమ బెంగాల్‌ను అభివృద్ధి చేయకుండా గందరగోళ వాతావరణం సృష్టించారని విరుచుకపడ్డారు. నందిగ్రామ్ లో మమతా క్లీన్ బౌల్డయ్యారని, దీంతో ఆమె టీమ్ మైదానం నుంచి బయటకు వెళ్లిపోవాల్సిందేనని జోస్యం చెప్పారు. పశ్చిమ బెంగాల్ లో తొలి నాలుగు విడతల ఎన్నికలలో ప్రజలు బౌండరీలు బాదాడంతో బిజెపి శతకం చేస్తుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు.