Sunday, December 22, 2024

రాజకీయ సన్యాసం తీసుకోలేదు..ఎన్నికల్లో పోటీ చేస్తా: ఉమాభారతి

- Advertisement -
- Advertisement -

భోపాల్‌ఐ తాను రాజకీయ సన్యాసం తీసుకోలేదని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకురాలు ఉమా భారతి స్పష్టం చేశారు.

ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ముందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన సాగర్ జిల్లాలో ఒక బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ చాలా ఏళ్లుగా ప్రజా సేవలో ఉన్నందున విరామం కోసం ఐదేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. విశ్రాంతి కోసమే గత ఎన్నికల్లో పోటీ చేయలేదని ఆమె తెలిపారు. అయితే తాను రాజకీయాలను వదిలిపెట్టినట్లు ప్రజలు భావించారని, తాను రాజకీయ సన్యాసం తీసుకోలేదని చెప్పిచెప్పి విసుగు వస్తోందని ఆమె అన్నారు.

తాను రాజకీయాలలో ఉన్నందువల్లే అనేక అభివృద్ధి ప్రాజెక్టులు మధ్యప్రదేశ్‌లో అమలు జరిగాయని ఆమె తెలిపారు. తనకు 75 లేదా 85 ఏళ్లు వచ్చినా రాజకీయాలను మాత్రమే వదిలే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. తనకు రాజకీయాలంటే చాలా ఇష్టమని కూడా ఉమా ‚భారతి తెలిపారు. రాజకీయాలతో విలాస జీవితం గడపాలనుకున్నవారి వల్లే రాజకీయాలు భ్రష్టు పడుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.

మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఏడాది చివరిలో, లోక్‌సభ ఎన్నికలు వచ్చే ఏడాదిలో జరగవలసి ఉన్నాయి. ఉమా భారతి చివరిసారి 2014 లోక్‌సభ ఎన్నికలలో ఉత్తర్ ప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. నరేంద్ర మోడీ సారథ్యంలోని బిజెపి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా ఆమె పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News