ఖాట్మండు: ప్రపంచంలో మూడవ అతిపెద్ద పర్వతమైన నేపాల్‌లోని కాంచనగంగ వద్ద శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. ఆ పర్వతంపై భారతీయ పర్వతారోహకుడు నారాయణ అయ్యర్ (52) ప్రాణాలు కోల్పోయారు. మౌంట్ కాంచనగంగపై సుమారు 8,200 మీటర్ల ఎత్తువద్ద అయ్యర్ మృతి చెందారు.ఆ పర్వతం ఎత్తు 8,586 మీటర్లు. మిగతా వాళ్లకన్నా అతను వెనుకబడి పోయారని, ఇద్దరు గైడ్లు సహకారం అందించినా అయ్యర్ కోలుకోలేక పోయారని పర్వతారోహక కంపెనీ పయనీర్ అడ్వెంచర్స్ ప్రతినిధి నివేశ్ కార్తి తెలిపారు. అయ్యర్ కుటుంబానికి ఆయన మరణవార్త తెలియజేసినట్లు చెప్పారు. నేపాల్ ఈ సీజన్‌లో కాంచనగంగ పర్వతారోహణకోసం విదేశీ పర్వతారోహకులకు 68 పర్మిట్లు జారీ చేసింది. వీరిలో చాలా మంది గురువారం పర్వతం శిఖరాగ్రానికి చేరుకున్నారు. ఈ ఏడాది నేపాల్‌లో మృతిచెందిన పర్వతారోహకుల్లో అయ్యర్ మూడో వ్యక్తి. గత నెల 8,167 మీటర్ల ఎత్తున్న ధవళగిరి పర్వతంనుంచి దిగుతున్న సమయంలో జారిపడి ఒక గ్రీకు పర్వతారోహకుడు మృతి చెందారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఎవరెస్టు పర్వతంపైకి పరికరాలు తీసుకెళ్తున్న నేపాలీ పర్వతారోహకుడొకరు మృతి చెందారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన పర్వతాల్లో ఎనిమిది నేపాల్‌లోనే ఉన్నాయి.