పలు రాష్ట్రాలలో వందదాటి పరుగులు
న్యూఢిల్లీ : డీజిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. రాజస్థాన్, కర్నాటక ఇతర ప్రాంతాలలో ఇప్పటికే డీజిల్ ధరలు లీటర్‌కు రూ 100 దాటాయి. ఇటీవలి కాలంలో వరుసగా ఇంధన ధరలు క్రమం తప్పకుండా పెరుగుతూ పోతున్నాయి. ఇప్పటికే డీజిల్ ధర వంద దాటిన రాష్ట్రాల జాబితాలో ఇప్పుడు కర్నాటక ఏడో స్ధానంలోకి చేరింది. శనివారం ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వెలువరించిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం పెట్రోలు ధర లీటర్‌కు 27 పైసలు పెరిగింది. ఇక డీజిల్ 23 పైసలు పెరిగి, ఇప్పుడు డీజిల్ పెట్రోలు ధరలు దాదాపుగా సమానం అయి మరింత పెరిగే దిశలో పోటీ పడుతున్నాయి. మే నెల 4వ తేదీ నుంచి ఇప్పటివరకూ పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం ఇది 23వ సారి. ఇప్పుడు వాహన సంచాలక ఇంధన ధరలు పెరగడం శిఖరస్థాయి అయింది. ఒక్క ఢిల్లీలో పెట్రోలులీటర్‌కు రూ 96.12 పైసలు , డీజిల్ లీటర్‌కు రూ 86.98 అయింది.
అయితే తెలంగాణ, లడఖ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేంద్ర పాలిత ప్రాంతాలలో డీజిల్ రూ వంద దాటిపోయింది. గత నెల 29నే దేశంలో ఎక్కడా లేని విధంగా మహానగరం ముంబైలో పెట్రోలు లీటర్‌కు రూ 100 దాటింది. ఇప్పుడు అక్కడ పెట్రోలు ధర రూ 102.30 అయింది. అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరల ప్రభావంతో అనివార్యంగా దేశంలో పెట్రో ధరలు పెంచాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక పలు దేశాలలో కొవిడ్ వ్యాక్సిన్లు, క్రమేపీ లాక్‌డౌన్ల సడలింపుల ప్రక్రియలతో ఇంధన డిమాండ్ పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలలో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి.