మోడీ ప్రభుత్వ దూకుడు విధానాలకు అడ్డుకట్ట వేయాలని, ఈ మేరకు సమష్టిగా పోరాటం సాగించాలన్న లక్షంతో ఏర్పడిన ఇండియా కూటమి నాయకత్వంపై విభేదాలు తలెత్తాయి. మహారాష్ట్రలో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించడం, ఇండియా కూటమి భాగస్వామ్య మహావికాస్ అఘాడీ చాలా పేలవం కావడం కూటమి నాయకత్వంలో మార్పు అవసరమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ విధానాలు, నిర్ణయాలు సరిగ్గా లేనందునే మహారాష్ట్రలో ఫలితాలు రాలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బహిరంగంగా ధ్వజమెత్తారు. అవసరమైతే ఇండియా కూటమికి తాను నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. దీంతో కూటమి నాయకత్వంలో మార్పు అవసరమన్న అభిప్రాయాలు బయటపడుతున్నాయి. మమతా బెనర్జీయే నాయకత్వం వహించగల సమర్థురాలని, ఆమెకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే భవిష్యత్‌లో ఫలితాలు బాగుంటాయని ప్రతిపాదనలు ముందుకు వస్తున్నాయి. ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్, ఎన్‌సిపి (ఎస్‌పి) అధినేత శరద్ పవార్ కూడా మమతా బెనర్జీకి మద్దతు పలుకుతున్నారు. శివసేన (యుబిటి) అధినేత కూడా మమత నాయకత్వం మంచిదే అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కాంగ్రెస్ మాత్రం దీనికి అంగీకరించడం లేదు. కాంగ్రెస్ అభ్యంతరం పట్టించుకోవలసిన విషయం కాదని, ఇండియా కూటమికి నాయకత్వం బాధ్యత మమతా బెనర్జీకే తప్పనిసరిగా అప్పగించాలన్నది తన అభిప్రాయమని ఆర్‌జెడి చీఫ్ లాలూ ప్రసాద్ పాట్నాలో ఒక కార్యక్రమం సందర్భంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. శివసేన (యుబిటి) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఇండియా కూటమి నాయకత్వం విషయమై తమ పార్టీ బహిరంగంగా చర్చించడానికి సిద్ధంగా ఉందని ఢిల్లీలో వెల్లడించారు.కాంగ్రెస్ నాయకత్వంతో తమకు మంచి సంబంధాలున్నాయని, అయితే కూటమిని మరింత బలోపేతం చేయాలనుకుంటే ప్రతివారూ దీనిపై చర్చించాలన్న ఆసక్తితో ఉంటారని పేర్కొన్నారు. మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాకరే, లాలూ ప్రసాద్, శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్ ఇలా ఎవరైనా సరే ఎవరు నాయకత్వం వహించడానికి అత్యంత సమర్థులో అన్న అంశంపై చర్చలు లోతుగా జరగాలని రౌత్ సూచించారు. మమతా బెనర్జీకి లాలూప్రసాద్ యాదవ్ బహిరంగంగా మద్దతు పలకడం కూటమిలోని భాగస్వాములైన పార్టీలపై ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌లో అంతర్మథనం ప్రారంభమైంది. రానున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలన్న అవసరం ఏర్పడుతోందని కాంగ్రెస్ భావిస్తోంది. వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ఆర్‌జెడి కాంగ్రెస్ పొత్తుతో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆర్‌జెడి చీఫ్ కాంగ్రెస్‌ను పక్కన పెట్టి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మద్దతు పలకడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. బీహార్‌లో ఆర్‌జెడి అంతగా ప్రభావం చూపించలేకపోతోంది. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలకు ఆర్‌జెడి 23 స్థానాల్లో పోటీచేయగా, కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేసి మూడు స్థానాల్లో గెలుపొందింది. ఏదేమైనా హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఓటమి పొందడం ఇతర రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ డిసెంబర్ 10న పార్లమెంట్ అనుబంధ భవనంలో కాంగ్రెస్ ఎంపిల సమావేశంలో మాట్లాడుతూ లోక్‌సభలో ఏకైక భారీ విపక్షం కాంగ్రెస్ పార్టీయేనని, ప్రతి అంశాన్నీ సమస్యను పరిష్కరించే సామర్థం కాంగ్రెస్‌కు ఉందని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ నాయకత్వానికి లాలూ ప్రసాద్, ఎన్‌సిపి (ఎస్‌పి) చీఫ్ శరద్‌పవార్ మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించిన మరునాడే రాహుల్ ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం. ఇండియా కూటమి నాయకులతో మన నాయకత్వ సంబంధం హార్థికమైనదని, అందువల్ల కూటమి భాగస్వామ్య నేతల వ్యాఖ్యలకు స్పందించవద్దని, కేంద్రం లోని బిజెపి ప్రభుత్వంపై, అద్వానీ అంశంపై ఒత్తిడి పెంచడానికి పోరాటం సాగించాలని రాహుల్ సూచించినట్టు కాంగ్రెస్ ఎంపి ఒకరు పేర్కొన్నారు. అయితే పార్లమెంట్ సమావేశాల్లో అదానీపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్‌కు మద్దతు విషయంలో ఆర్‌జెడి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపిలు దూరంగా ఉంటున్నారు. పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా జరగకుండా ఆటంకం కలిగిస్తున్నారని బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపి కళ్యాణ్ బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ సందర్భంగా గమనించాల్సిన అవసరం ఉంది. బిజెపి, కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు వల్లనే సభ వాయిదా పడుతోందని ఆ రెండు పార్టీలు మాట్లాడడానికే ఎక్కువ అవకాశం లభిస్తోందని, తమకు అవకాశం లభించడం లేదని ఆయన ఆరోపించారు. అయితే రాజ్యసభ ఛైర్మన్, జగదీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు మాత్రం ఇండియా కూటమి భాగస్వాములైన అన్ని పార్టీలు మద్దతు పలుకుతూ సంతకాలు చేశాయి. ఈ సంఘటన ఇండియా కూటమి సమైక్యంగా ఉందని చెప్పడానికి బలమైన ఉదాహరణ కాదు. చాలా అంశాల్లో ఇండియా కూటమి నేతలు ఎవరికి వారే యమునా తీరేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆమ్‌ఆద్మీ పార్టీ కూటమికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కూటమి భాగస్వామ్య పార్టీలు చాలా వరకు కాంగ్రెస్ నాయకత్వంపై సంతృప్తిగా ఉండడం లేదు. మరో వైపు కూటమి నాయకత్వ మార్పుకు కాంగ్రెస్ మొగ్గు చూపడం లేదు.
ఎవరికి వారే యమునా తీరే
- Advertisement -
- Advertisement -
- Advertisement -