Sunday, February 16, 2025

ఎగ్జిక్యూటివ్ నియామకాల్లో సిజెఐ పాత్రపై భిన్నాభిప్రాయాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎగ్జిక్యూటివ్ నియామకాల్లో భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) పాత్ర ఉండాలా వద్దా అనే విషయమై న్యాయ నిపుణులు శనివారం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ నియామకాల ప్రక్రియలో సిజెఐ భాగస్వామ్యం నిష్పాక్షికతకు దోహదం చేస్తుందని కొందరు వాదించగా, ఆయన అటువంటి ఎంపిక కమిటీల్లో ఉండరాదని మరి కొందరు స్పష్టం చేశారు. సిబిఐ డైరెక్టర్ వంటి ఎగ్జిక్యూటివ్ నియామకాల్లో ‘చట్టపరమైన నిర్దేశం’ ప్రకారమైనా సిజెఐ ఎలా ప్రమేయం పెట్టుకుంటారని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ శుక్రవారం ప్రశ్నించిన నేపథ్యంలో న్యాయ నిపుణుల నుంచి ఆ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అటువంటి నిబంధనలను ‘పునఃపరిశీలించవలసిన’ సమయం వచ్చిందని ధన్‌ఖడ్ సూచించారు.

సిబిఐ డైరెక్టర్, ఇతర ఎగ్జిక్యూటివ్ నియామకాలకు సంబంధించిన ఎంపిక కమిటీలో సిజెఐ భాగం కారాదని ప్రముఖ రాజ్యాంగ నిపుణులు, సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది అన్నారు. సిజెఐ భాగస్వామ్యంతోనే అటువంటి నియామకాలు ప్రయోజనకరం అవుతాయని సీనియర్ న్యాయవాది షోయబ్ ఆలమ్ వ్యాఖ్యానించారు. ఎంపిక కమిటీ నుంచి సిజెఐని మినహాయించిన 2023 చట్టం కింద ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి), ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన వ్యవహారం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఉప రాష్ట్రపతి అటువంటి ప్రకటన చేసి ఉండవలసింది కాదని సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ అన్నారు.

ఎంపిక ప్రక్రియలో సిజెఐకి ప్రమేయం కల్పించడం దానిని స్వేచ్ఛగాను, నిష్పాక్షికంగాను చేయడమే అయినప్పటికీ ఉప రాష్ట్రపతి అటువంటి ప్రకటన చేసి ఉండవలసింది కాదని మరొక సీనియర్ న్యాయవాది మోహిత్ మాథుర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘న్యాయవ్యవస్థను కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల నుంచి వేరు చేసిన దృష్టాను, సుప్రీం కోర్టు న్యాయ సమీక్ష అధికారాలు వినియోగిస్తున్న దృష్టాను సిబిఐ డైరెక్టర్, ఇతర ఎగ్జిక్యూటివ్ నియామకాలకు సంబంధించిన ఎంపిక కమిటీలో ప్రధాన న్యాయమూర్తి భాగం కారాదు. అయితే, ఆ నియామకాలు జ్యుడీషియల్ ట్రైబ్యునళ్లకు అయినట్లయితే ఆయన భాగం కావచ్చు’ అని ద్వివేది అన్నారు. ‘సిజెఐ భాగస్వామ్యం కీలక పదవులకు ఎంపికల్లో నిష్పాక్షికతను, న్యాయబద్ధతను చేకూరుస్తుంది’ అని షోయబ్ ఆలమ్ సూచించారు.

మన వంటి ప్రజాస్వామ్య వ్యవస్థల్లో అటువంటి నియామకాలు సిజెఐ భాగస్వామ్యం వల్ల ప్రయోజనకరం అవుతాయని ఆయన అన్నారు. ‘నియామకాల ప్రక్రియ విశ్వసనీయత పెంపుదలను, సముచిత ప్రక్రియకు నిబద్ధమై ఉండడాన్ని న్యాయవ్యవస్థ అతిజోక్యంగా లేదా కార్యనిర్వాహక వ్యవస్థ అధికారంలోకి చొరబాటుగా పరిగణించరాదు’ అని ఆలమ్ అన్నారు. ‘చాలా వరకు ముఖ్యంగా నియామకం విషయంలో ఏ చట్టమూ లేనప్పుడు అనువైన నియామకం జరిగేలా అది దోహదం చేస్తుంది. ఇటీవలి వరకు ఇసిలు, సిఇసి నియామకానికి సంబంధించిన కేసు ఇటువంటిదే’ అని ఆలమ్ పేర్కొన్నారు.

‘ఇది కోర్టు పరిధిలో ఉన్నందున ఉప రాష్ట్రపతి గాని, నేను గాని దీనిపై వ్యాఖ్యానించరాదు. ఆయనకు బాగా తెలిసి ఉండాలి’ అని శంకరనారాయణన్ అన్నారు. సిబిఐ డైరెక్టర్ ఎంపిక ప్రక్రియలో ప్రధాని కూడా సిజెఐతో పాటు ప్రమేయం కలిగి ఉంటారని మాథుర్ చెప్పారు. ‘అవి రాజ్యాంగ పదవులు. రాజ్యాంగ పదవుల విషయమై వేలెత్తి చూపరాదని నా భావన’ అని ఆయన అన్నారు. ఉప రాష్ట్రపతి పదవి పార్టీలకు లేదా ప్రభుత్వ ప్రాతిపదికగా అతీతమైనదని మాథుర్ అన్నారు. ‘రాష్ట్రపతి వలె, ఉప రాష్ట్రపతి కూడా అన్ని రకాల పక్షపాతాలకు అతీతంగా ఉండవలసి ఉంటుంది. ఆయన (ఉపరాష్ట్రపతి) అటువంటి ప్రకటన చేసి ఉండవలసింది కాదు’ అని మాథుర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ధన్‌ఖడ్ శుక్రవారం భోపాల్‌లో నేషనల్ జ్యుడీషియల్ అకాడమీలో మాట్లాడుతూ, తన అభిప్రాయం ప్రకారం, ‘మౌలిక వ్యవస్థ సిద్ధాంతానికి’ అత్యంత ‘చర్చనీయ న్యాయశాస్త్ర ప్రాతిపదిక’ ఉందని చెప్పారు.

‘మన వంటి ఒక దేశంలో లేదా ఏదైనా ప్రజాస్వామ్యంలో చట్టపరమైన నిర్దేశం మేర భారత ప్రధాన న్యాయమూర్తి సిబిఐ డైరెక్టర్ ఎంపికలో ఎలా పాల్గొనగలరు’ అని ధన్‌ఖడ్ సభికులను ప్రశ్నించారు. ‘దానికి చట్టపరమైన హేతుబద్ధత ఉంటుందా? ఆనాటి కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయవ్యవస్థ తీర్పునకు శిరసావహించినందున చట్టపరమైన నిర్దేశం రూపుదిద్దుకుందని గుర్తిస్తా. అయితే, పున్‌ఃపరిశీలనకు సమయం వచ్చింది. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్యంతో విలీనం కాదు. ఏ ఎగ్జిక్యూటివ్ నియామకంతోనైనా భారత ప్రధాన న్యాయమూర్తికి ప్రమేయం కల్పించగలం’ అని ధన్‌ఖడ్ అన్నారు. కాగా, 2023 చట్టం కింద సిఇసి, ఇసిల నియామకానికి సంబంధించిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 19న విచారించనున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News